Share News

ఇంటర్‌లో జిల్లాకు 11వ స్థానం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:13 AM

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు 11వ స్థానం లభించింది. ఇంటర్‌ జనరల్‌ కోర్సుల్లో జిల్లా నుంచి 5,475 మంది ప్రథమ సంవత్సరంలో పరీక్షలు రాయగా 3,565 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌లో  జిల్లాకు 11వ స్థానం

ఒకేషనల్‌ కోర్సుల్లో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం

పార్వతీపురం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు 11వ స్థానం లభించింది. ఇంటర్‌ జనరల్‌ కోర్సుల్లో జిల్లా నుంచి 5,475 మంది ప్రథమ సంవత్సరంలో పరీక్షలు రాయగా 3,565 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 5,292 మంది పరీక్షలు రాయగా 4054 మంది పాసయ్యారు. ప్రథమ సంవత్సరంలో 65 శాతం, ద్వితీయ సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు పరీక్షల ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించింది

జిల్లాలో పరిస్థితి ఇదీ..

జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో జనరల్‌ మొదటి సంవత్సరంలో 1761 మంది పరీక్షలు రాయగా 934 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ కోర్సులకు సంబంధించి 1,717 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,169 మంది పాసయ్యారు. మొదటి సవత్సరం ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి 737 మంది హాజరుకాగా 52 మంది , రెండో సంవత్సరంలో 618 మంది విద్యార్థులకు గాను 488 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఒకేషనల్‌ కోర్సుల ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లభించింది.

- ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 96 శాతం ఉత్తీర్ణతతో కొమరాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రథమ స్థానంలో ఉంది. 93 శాతం ఉత్తీర్ణతతో మక్కువ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది.

- ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లో 98 శాతంతో కొమరాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రథమస్థానంలో, మక్కువ జూనియర్‌కళాశాల 95 శాతం ఉత్తీర్ణతతో ద్వితీయ స్థానంలో నిలిచాయి.

- జిల్లాలో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలకు సంబంఽధించి కొమరాడ, గరుగుబిల్లిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు.

- కేజీబీవీ విభాగంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మక్కువ, గరుగుబిల్లి కళాశాలల విద్యార్థినులు, ద్వితీయ సంవత్సరంలో మక్కువ, గరుగుబిల్లి, జోగింపేట, కురుపాం, చిన్నమేరంగి కళాశాలల విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు.

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో..

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో జోగింపేట ఎస్‌వోయూ కళాశాల, భద్రగిరి, పి.కోనవలస, కురుపాం బాలికల కళాశాలలతో పాటు భద్రగిరి, పి.కోనవలస బాలురు గురుకుల కళాశాల నుంచి 660 మంది ప్రథమ సంవత్సరంలో పరీక్షలు రాయగా 605 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 589 మంది పరీక్షలు రాయగా 543 మంది ఉత్తీర్ణత సాధించారు.

కొన్ని కళాశాలల్లో ఇలా..

జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఫలితాలు దారుణంగా ఉన్నాయి. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 203 మంది ప్రథమ సంవత్సరంలో పరీక్షలు రాయగా కేవలం 44 మంది మాత్రమే పాసయ్యారు.

- సాలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 180 మంది పరీక్షలు రాయగా ప్రథమ సంవత్సరంలో 50 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

- పాలకొండ జూనియర్‌ కళాశాలలో 118 మందికి గాను మొదటి సంవత్సరంలో కేవలం 30 మంది మా త్రమే పాసయ్యారు. పాలకొండ బాలుర జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 155 మంది పరీక్షలు రాయగా 44 మంది మా త్రమే ఉత్తీర్ణత సాధించారు.

- భామిని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 96 మంది పరీక్షలు రాయగా 47 మంది మా త్రమే పాసయ్యారు.

- వీరఘట్టం జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 103 మంది పరీక్షలు రాయగా ఐదుగురే ఉత్తీర్ణులయ్యారు.

- బలిజిపేట ప్రథమ సవత్సరంలో జూనియర్‌ కళాశాలలో 104 మంది పరీక్షలు రాగా 32 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ విధంగా ప్రథమ సంవత్సర ఫలితాల్లో చాలా ప్రభుత్వ కళాశాలలు వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు. మరికొన్ని కళాశాలలో 50 శాతం లోపు ఫలితాలే వచ్చాయి.

ద్వితీయ సంవత్సరంలో..

- పాలకొండ ప్రభుత్వ బాలుర కళాశాలలో ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 141 మంది పరీక్షలు రాయగా 76 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

- పార్వతీపురం జూనియర్‌ ళాశాలలో 159 మంది పరీక్షలు రాయగా 78 మాత్రమే పాసయ్యారు.

- సాలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 149 మంది పరీక్షలు రాయగా కేవలం 58 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ విధంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అనేక ప్రభుత్వ కళాశాలల్లో దారుణమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. జిల్లాలో కొమరాడ, మక్కువ, కురుపాం జూనియర్‌ కళాశాలలు ఫలితాల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

శతశాతం ఉత్తీర్ణత

- గరుగుబిల్లి: ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో గరుగుబిల్లి మండలంలోని పలు ప్రభుత్వ కళాశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. గరుగుబిల్లిలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలకు సంబంధించి మొదటి సంవత్సరం ఇంటర్‌లో 54 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారంతా ఉత్తీర్ణత సాధించారు. కళాశాలకు చెందిన పి.మేఘన ఎంపీసీ విభాగంలో 453 మార్కులు, బైపీసీకి సంబంధించి కె.శ్రావణి 427 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 67 మంది పరీక్షలుకు హాజరు కాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీకి సంబంధించి టి.శిరీష 955 మార్కులు, పి.ధనలక్ష్మి 955 మార్కులు సాధించారు. రావివలసలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్‌ కళాశాలకు సంబంధించి మొదటి సంవత్సరం బైసీపీకి సంబంధించి 39 మంది బాలికలు హాజరుకాగా వారంతా ఉత్తీర్ణత సాధించారు. కళాశాలకు సంబంధించిన పలువురు 428 మార్కులు సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 33 మంది హాజరుకాగా 33 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 946 మార్కులను పలువురు సాధించారు.

- మక్కువ: కాశీపట్నపం కేజీబీవీ నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 35 మంది హాజరుకాగా 35 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 33 మంది హాజరు కాగా 33 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలు భేష్‌...

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విభాగాల్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయని జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి డి.మంజులవీణ తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం కూడా బాగుందన్నారు. మొత్తంగా ఒకేషనల్‌ కోర్సు ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి ర్యాంకు సాధించిందన్నారు. జనరల్‌ కోర్సులు సంబంధించి రాష్ట్రంలో 11వ ర్యాంకులో జిల్లా ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - Apr 13 , 2024 | 12:13 AM