జోన్ స్థాయిలో సమీక్షలు
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:19 AM
జీవీఎంసీలో వివిధ విభాగాల మధ్య సమన్వయలోపం కారణంగా పెండింగ్‌లో ఉండిపోయిన ప్రజా సమస్యల పరిష్కారానికి ఇకపై జోన్‌ల వారీగా సమీక్షలు నిర్వహించాలని కమిషనర్ పి.సంపత్‌కుమార్ నిర్ణయించారు.
జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ నిర్ణయం
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీలో వివిధ విభాగాల మధ్య సమన్వయలోపం కారణంగా పెండింగ్‌లో ఉండిపోయిన ప్రజా సమస్యల పరిష్కారానికి ఇకపై జోన్‌ల వారీగా సమీక్షలు నిర్వహించాలని కమిషనర్ పి.సంపత్‌కుమార్ నిర్ణయించారు. అందులో భాగంగా తొలుత మంగళవారం జోన్-2 కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్యం, హార్టికల్చర్, నీటి సరఫరా విభాగాల మధ్య సమన్వయ లోపంతో కొన్నిపనులు పెండింగ్‌లో ఉండిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని కమిషనర్ గుర్తించారు. ఏళ్లతరబడి సమస్యలు పరిష్కారం కాకపోతే జీవీఎంసీపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని కమిషనర్ భావిస్తున్నారు. అందుకు అవకాశం లేకుండా అన్ని విభాగాల అధిపతులతో కనీసం నెలకు ఒక జోన్‌లోనైనా పెండింగ్ సమస్యలపై సమీక్ష నిర్వహించడం వల్ల ఫలితం ఉంటుందని కమిషనర్ ఆశిస్తున్నారు.