Share News

దళితులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:32 AM

దళితులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ న్యాయం చేస్తామని బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు.

దళితులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం
మాట్లాడుతున్న బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

కూటమి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తాం

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ

కొత్తూరు, ఏప్రిల్‌ 15 : దళితులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ న్యాయం చేస్తామని బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు. సోమవారం అనకాపల్లి పట్టణంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్‌ అధ్యక్షతన జరిగిన దళిత ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం టీడీపీ అమలు చేసిన 27 పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. మాస్క్‌లు లేవని ప్రశ్నించిన ఒక డాక్టర్‌ను పిచ్చివాడు అనే ముద్ర వేసి చంపిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని రద్దు చేయడం ద్వారా అనేక మంది యువత ఉన్నత విద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కమలం గుర్తుపై, అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకష్ణకు గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కోట్ని బాలాజీ, దూలం గోపీ, పావాడ కామరాజు, కోన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:32 AM