వైసీపీ ఎంపీ అభ్యర్థి ‘బూడి’
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:59 AM
అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్త పేరును వైసీపీ అధిష్ఠానం ఎట్టకేలకు మంగళవారం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పేరును ఖరారు చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా ముత్యాలనాయుడు పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఆయన కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిసింది.
ఉప ముఖ్యమంత్రిని సమన్వయకర్తగా నియమించిన అధిష్ఠానం
మాడుగుల ఇన్‌చార్జిగా ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ
గవర సామాజికవర్గానికి వైసీపీ మొండిచేయి
ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ఒక్కటీ కేటాయించని అధికార పార్టీ పెద్దలు
అనకాపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్త పేరును వైసీపీ అధిష్ఠానం ఎట్టకేలకు మంగళవారం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పేరును ఖరారు చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా ముత్యాలనాయుడు పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఆయన కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిసింది.
రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను అనకాపల్లి మినహా మిగిలిన అన్ని స్థానాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల పేర్లను ఈ నెల 16వ తేదీన పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. జాబితాలో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరు వద్ద ఖాళీ వుంచి, ‘కేటగిరి’ కాలమ్‌లో ‘బీసీ’ అని మాత్రమే పేర్కొన్నారు. కాగా అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి కూటమి తరపున జనసేన పోటీ చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ బీజేపీతో టీడీపీ-జనసేన పార్టీలకు పొత్తు కుదిరిన తరువాత ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో బీజేపీ అభ్యర్థినిబట్టి తమ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ పెద్దలు భావించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల కోసం అప్పటి నుంచి నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు బీజేపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఆదివారం విడుదల కావడం, అనకాపల్లి నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పోటీ చేస్తారని వెల్లడికావడంతో వైసీపీ అధిష్ఠానం వేగంగా పావులు కదిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి సమన్వయకర్తగా ఉపముఖ్యమంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పేరును మంగళవారం ప్రకటించింది. మాడుగుల నియోజకవర్గం సమన్వయకర్తగా ఆయన కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధను నియమించారు.
గవర సామాజిక వర్గానికి వైసీపీ మొండి చేయి
జిల్లాలో ప్రధానమైన గవర సామాజికవర్గాన్ని వైసీపీ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు (మరొకటి పాక్షికం) వుండగా.. వచ్చే ఎన్నికల్లో ఒక సీటు కూడా ఈ సామాజికవర్గానికి కేటాయించలేదు. ప్రస్తుతం ఈ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బీవీ సత్యవతి అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆమెకు అవకాశం ఇవ్వకూడదని భావించిన పార్టీ పెద్దలు.. అదే సామాజికవర్గానికి చెందిన ఎలమంచిలి మునిసిపల్ ఛైర్‌పర్సన్ పి.రమాకుమారి పేరును పరిశీలించారు. అప్పట్లో ఆమెను తాడేపల్లి పిలిపించుకొని మాట్లాడారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్తగా ఆమెను నియమిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించడం, ఆ పార్టీ తరపున సీఎం రమేశ్ పేరు ఖరారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బూడి ముత్యాల నాయుడును రంగంలోకి దించాలని నిర్ణయించారు. దీంతో గవర సామాజిక వర్గానికి ఇటు అసెంబ్లీకి, అటు లోక్‌సభకు పోటీ చేసే అవకాశాన్ని వైసీపీ పెద్దలు కల్పించలేదు.
వైసీపీ మాడుగుల అభ్యర్థిగా అనురాధ!?
మాడుగుల, మార్చి 26: ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధను మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వైసీపీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో మాడుగుల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టేనని నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న ఈమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1986 నవంబరు 4వ తేదీన బూడి ముత్యాలనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించిన అనురాధ.. ఇంటర్ వరకు చదివారు. భర్త ఈర్లె గంగునాయుడు. ఇతను గతంలో కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. వీరికి ఇద్దరు పిల్లలు.. కుమార్తె, కుమారుడు వున్నారు.