వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:16 AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థినిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది.

లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగింత
మూడో జాబితాలోనూ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించని అధిష్ఠానం
ప్రచారంలో పలువురి పేర్లు
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఎక్కడో స్థానం?
విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థినిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆమెను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జులను నియమిస్తూ గురువారం మూడో జాబితా విడుదల చేసింది. అందులో బొత్స ఝాన్సీలక్ష్మి పేరు ఉంది.
విజయనగరం జిల్లాకు చెందిన ఝాన్సీలక్ష్మి ఆ జిల్లా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా రెండుసార్లు, బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఒక్కోసారి పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తర్వాత ఆమె భర్త బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరగా, 2019 ఎన్నికల్లో ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2024 ఎన్నికల్లో ఆమె విజయనగరం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా, విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. గత నాలుగున్నరేళ్లుగా ఝాన్సీలక్ష్మి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. విశాఖలో అయితే ఆమె ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాల్లేవు. అయినప్పటికీ ఆమెను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపాలని నిర్ణయించడంపై పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి.
రసవత్తరంగా ‘అనకాపల్లి’ రాజకీయం
అనకాపల్లి జిల్లాలో వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీ అధిష్ఠానం గురువారం రాత్రి 21 మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితా విడుదల చేసింది. అయితే అందులో అనకాపల్లి జిల్లా నుంచి ఒక్క స్థానం కూడా లేకపోవడం గమనార్హం. అనకాపల్లి ఎంపీ స్థానంతో పాటు పెందుర్తి, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే, జిల్లా మంత్రి గుడివాడ్ అమర్‌నాథ్‌కు ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారో ఇంకా స్పష్టత రాలేదు. పెందుర్తి నుంచి అవకాశం ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను మారుస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఆయన బుధవారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో ఆయనకే మళ్లీ అవకాశం ఇస్తామని చెప్పినట్టు గురువారం ప్రచారం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు సీటు ఎక్కడ కేటాయిస్తారో చూడాలి. తాజా పరిణామాలతో చోడవరం నుంచి అవకాశం కల్పించవచ్చునని ప్రచారం మొదలైంది. అయితే అక్కడి ఎమ్మెల్యే ధర్మశ్రీకి ఎక్కడ ఇస్తారనేది ప్రశ్నగా మారింది. ఆయన్ను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయమంటున్నారని కొందరు చెబుతున్నారు. కానీ అనకాపల్లి ఎంపీగా ఆడారి తులసీరావు కుమార్తె పిళ్లా రమాకుమారి పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అదే కుటుంబంలో తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌కుమార్‌కు విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడో వచ్చేసింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లు ఇస్తారా?...అని కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. లేదంటే...గవర సామాజిక వర్గంలో ఇంకెవరికైనా అవకాశం ఇవ్వవచ్చునంటున్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేటి కాశీ విశ్వనాథం అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఎంపీగా ఎవరు పోటీలో దిగినా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన ఆర్థిక వనరులు ఉన్నవారినే పార్టీ ఎంపిక చేస్తుంది. ఇదిలావుండగా సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సత్యవతి మరోమారు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ పెద్దలను కోరారు. ఒకవేళ సమీకరణాల వల్ల ఎంపీ సీటు ఇవ్వలేకపోతే అసెంబ్లీ టికెట్ అయినా ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.