Share News

పెన్షన్లపై వైసీపీ దుష్ప్రచారం

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:39 AM

వైసీపీ నాయకులు బరితెగించేశారు. ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంపైకి నెట్టేస్తున్నారు.

పెన్షన్లపై వైసీపీ దుష్ప్రచారం

ఇంటింటికీ వెళుతున్న నేతలు

తెలుగుదేశం పార్టీపై అభాండాలు

జగన్‌ మళ్లీ సీఎం కాకపోతే వలంటీర్లు ఉండరంటూ ప్రచారం

వారు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారనే కదా...

ఎన్నికల సంఘం ఆపేసిందని ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే సమాధానం

చెప్పకుండా జారుకుంటున్న వైనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ నాయకులు బరితెగించేశారు. ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంపైకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికీ పనిగట్టుకొని తిరుగుతూ పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న వృద్ధులను బయటకు పిలిచి, ‘మీకు పెన్షన్‌ అందిందా? ఇంకా ఇవ్వలేదు కదా?, వలంటీరు రాలేదు కదా! మీకు సచివాలయానికి రమ్మంటున్నారా?’...అంటూ పలకరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఇంటికి వచ్చి సేవ చేస్తున్న వలంటీర్లను ఇప్పుడు రాకుండా చేసింది చంద్రబాబేనని చెబుతున్నారు. ఆయన కేసు వేయడం వల్లే మరో మూడు నెలలు వలంటీర్లు ఇళ్లకు రారని, సేవలు చేయరని చిలవలు పలవలు చేసి వివరిస్తున్నారు. మళ్లీ జగన్‌ వస్తేనే వలంటీర్ల సేవలు కొనసాగుతాయని, లేదంటే పెన్షన్లు బయటకు వెళ్లి తీసుకోవలసి ఉంటుందని భయపెడుతున్నారు. నగరంలో వివిధ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఈ రకమైన ప్రచారం చేయాలని మహిళా నాయకులకు పురమాయించారు. ఆ మాటలన్నీ వీడియో తీసి గ్రూపుల్లో ప్రచారం చేయాలని సూచించారు. అయితే వలంటీర్లంతా వైసీపీకి చెందిన కార్యకర్తలు కాబట్టే, పార్టీ కోసం పనిచేస్తున్నారనే ఎన్నికల సంఘం తీసేసింది కదా? అని చదువుకున్నవారు ఎదురు ప్రశ్నిస్తే...వారికి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి జారుకుంటున్నారు. వలంటీర్లు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని రూల్‌ లేదు కదా?...ఇంకెవరైనా తెచ్చి ఇవ్వవచ్చు కదా? ఎందుకు ఆ ఏర్పాట్లు చేయలేదు?...అని ప్రశ్నిస్తే వాటికి కూడా జవాబు చెప్పలేక ఆ వీధుల నుంచి వైసీపీ నాయకులు వెళ్లిపోతున్నారు. వృద్ధులం కాబట్టి తమకు ఇంటికే పెన్షన్లు ఇవ్వాలని, సచివాలయం సిబ్బందితో పంపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి తప్పనిసరిగా ఇంటికే వచ్చి ఇవ్వాలని, దానికి ప్రభుత్వం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని పెన్షనర్లు కోరుతున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 01:39 AM