వైసీపీ నేతలు బరితెగింపు
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:28 AM
బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడిలో వైసీపీ నేతలు బరితెగించారు. సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులపై కర్రలతో దాడికి తెగబడ్డారు.
బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడిలో టీడీపీ నాయకులపై కర్రలతో దాడి
తెలుగు యువత మండల అధ్యక్షుడు, అతని సోదరుడికి తీవ్రగాయాలు
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలింపు
చోడవరం, బుచ్చెయ్యపేట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడిలో వైసీపీ నేతలు బరితెగించారు. సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులపై కర్రలతో దాడికి తెగబడ్డారు. తెలుగు యువత మండల అధ్యక్షుడు సేనాపతి మణికంఠ, అతని సోదరుడు శ్రీనివాసరావులపై వైస్ ఎంపీపీ గొంపా చినబాబు, అతని కుమారులు, సోదరుడి కుమారులు దారి కాచి కర్రలతో దాడి చేశారు. దీంతో మణికంఠ, శ్రీనివాసరావులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దిబ్బిడి గ్రామానికి చెందిన తెలుగు యువత మండల అధ్యక్షుడు సేనాపతి మణికంఠను, అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, వైస్ ఎంపీపీ గొంపా చినబాబు కుమారులు కొద్దిరోజులుగా సూటిపోటి మాటలతో రెచ్చగొడుతున్నారు. సోమవారం మణికంఠ, అతని సోదరుడు శ్రీనివాసరావు వడ్డాదిలో ఉండగా, వారిని ఉద్దేశించి వైస్ ఎంపీపీ కుమారులు హేళనగా మాట్లాడుతూ, అసభ్యకరంగా ప్రవర్తించారు. మణికంఠ వారిని నిలదీయగా, అక్కడ ఉన్న కొందరు గొడవ పెరగకుండా సర్దుబాటు చేశారు. అనంతరం మణికంఠ, అతని సోదరుడు బైక్‌పై దిబ్బిడి బయలుదేరారు. వెంటనే వైస్ ఎంపీపీ కుమారులు కూడా బయలుదేరి, టీడీపీ వారికంటే ముందుగానే గ్రామ శివారుకు చేరుకున్నారు. అప్పటికే తమ వర్గీయులకు సమాచారం అందించడంతో వైస్ ఎంపీపీ చినబాబుతోపాటు అతని సోదరుడి కుమారులు అక్కడకు వచ్చారు. కొద్దిసేపటి తరువాత బైక్‌పై వస్తున్న మణికంఠ, అతని సోదరుడిని అడ్డగించి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మణికంఠ తలకు తీవ్రగాయాలు కాగా, శ్రీనివాసరావు పళ్లు విరిగిపోయాయి. ఇరువురినీ స్థానికులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పార్టీ నాయకులపై వైసీపీ నేతలు దాడి చేసినట్టు తెలియడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై బుచ్చెయ్యపేట పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.