Share News

కొత్తకోటలో వైసీపీ నేతల దందా

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:11 AM

మండలంలోని కొత్తకోటలో పంచాయతీకి చెందిన మార్కెట్‌ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా దర్జాగా దుకాణాలు నిర్మిస్తున్నారు. కబ్జాదారులు వైసీపీ నేతలు కావడంతో అడ్డుకోవడానికి పంచాయతీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

కొత్తకోటలో వైసీపీ నేతల దందా
కొత్తకోటలో మార్కెట్‌ స్థలంలో చేపట్టిన షాపు నిర్మాణం

గ్రామ పంచాయతీ స్థలం కబ్జా

పాలవర్గం అనుమతి లేకుండా దుకాణాల నిర్మాణం

సొంత స్థలంగా భావిస్తూ శాశ్వత కట్టడాలు

చోద్యం చూస్తున్న పంచాయతీ అధికారులు

రావికమతం, ఫిబ్రవరి 16: మండలంలోని కొత్తకోటలో పంచాయతీకి చెందిన మార్కెట్‌ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా దర్జాగా దుకాణాలు నిర్మిస్తున్నారు. కబ్జాదారులు వైసీపీ నేతలు కావడంతో అడ్డుకోవడానికి పంచాయతీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ప్రధాన రహదారి పక్కన గ్రామ పంచాయతీకి చెందిన ఈ స్థలాన్ని ఇటీవల పంచాయతీ అధికారులు అభివృద్ధి చేసి మార్కెట్‌ను అక్కడికి తరలించారు. నాబార్డు నిధులతో రెండు షాపులు నిర్మించారు. ఇందులో వ్యాపారాలు బాగా సాగుతుండడంతో మిగిలిన స్థలంపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. పంచాయతీ వార్డు సభ్యురాలి భర్త, మరో ముగ్గురు కలిసి షాపుల నిర్మాణం చేపట్టారు. పంచాయతీ తీర్మానంగానీ, బహిరంగ వేలం పాటగానీ నిర్వహించకుండా, తమ సొంత స్థలంగా భావిస్తూ శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం, బీపీపీ నాయకులు కోట సత్యనారాయణ, ఉగ్గిన శ్రీను, వెల్లంకి ఈశ్వరావు, ఎం.శ్రీను తదితరులు మాట్లాడుతూ, పంచాయతీ ఒకటో వార్డు సభ్యురాలు సీతిన శ్రావణి భర్త గిరి, చేపల వ్యాపారి నక్కా అప్పారావు,పెంటకోట రాము, కొశిరెడ్డి సర్వ కలిసి పంచాయతీ స్థలంలో అక్రమ నిర్మానాలు చేపడుతున్నారని ఆరోపించారు. దీనిపై మండల పరిషత్‌ ఏవోకి శుక్రవారం ఫిర్యాదు చేశామన్నారు. పంచాయతీ స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించాలని, దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా పంచాయతీ స్థలంలో అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు షాపులు నిర్మించడంపై పంచాతీయ ఈవో కృష్ణమోహన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. అనారోగ్యం కారణంగా సెలవులో వున్నానని, ఈ సమయంలో పంచాయితీ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. తక్షణమే వాటిని తొలగిస్తామని తెలిపారు.

Updated Date - Feb 17 , 2024 | 01:11 AM