Share News

వైసీపీ నేతలు బరితెగింపు

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:00 AM

అధికార పార్టీ నాయకులు మరోసారి బరితెగించారు. శారదా నదిలో ఇసుక అమ్మకాలు, మద్యం బెల్టు షాపు నిర్వహణకు వేలంపాట నిర్వహించారు. పైగా ఈ ప్రక్రియను ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే చేపట్టారు.

వైసీపీ నేతలు బరితెగింపు
ఇసుక, మద్యం బెల్టు షాపు వేలంపాటపై శనివారం రాత్రి గ్రామంలో దండోరా వేస్తున్న దృశ్యం

ఇసుక అమ్మకాలు, మద్యం బెల్టు షాపునకు వేలంపాట

ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నిర్వహణ

ఇసుక రూ.66 వేలు, బెల్టు షాపు రూ.40 వేలకు ఖరారు

కశింకోట, ఫిబ్రవరి 19: అధికార పార్టీ నాయకులు మరోసారి బరితెగించారు. శారదా నదిలో ఇసుక అమ్మకాలు, మద్యం బెల్టు షాపు నిర్వహణకు వేలంపాట నిర్వహించారు. పైగా ఈ ప్రక్రియను ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే చేపట్టారు. వెదురుపర్తి గ్రామంలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి స్థానికులు, టీడీపీ నాయకులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మండల కేంద్రమైన కశింకోట సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో శారదా నది ఒడ్డున వెదురుపర్తి గ్రామం వుంది. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం అంతగా లేకపోవడంతో ఇసుక తవ్వకాలకు అనుకూలంగా వుంది. అదే విధంగా గ్రామంలో మద్యం దుకాణం లేకపోవడంతో కొంతమంది వ్యక్తులు అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారు. దీంతో ఈ రెండు వనరులపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. నదిలో ఇసుక తవ్వకాలు/ అమ్మకం, మద్యం బెల్టు షాపు నిర్వహణకు వేలం పాట (అనధికారికంగా) నిర్వహించనున్నట్టు శనివారం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. ఆదివారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేలం పాట నిర్వహించారు. ఇసుక పాట రూ.66 వేలు, బెల్టు షాపుల పాట రూ.40 వేలకు పాడుకున్నట్టు తెలిసింది. కాగా పంచాయతీ కార్యాలయంలో అనధికార వేలం పాటపై కార్యదర్శి డి.ఆనందరావును వివరణ కోరగా, కింది స్థాయి సిబ్బందితో స్థానిక వైసీపీ నాయకులు పంచాయతీ కార్యాలయం తాళాలు తీయించి వేలం పాట నిర్వహించిన విషయం తన దృష్టికి రావడంతో సిబ్బందిని హెచ్చరించానని చెప్పారు. ఇకపై అలా జరగకుండా చూస్తామని తెలిపారు.

Updated Date - Feb 20 , 2024 | 01:00 AM