యర్రవరం జలపాతం రహదారికి మోక్షం
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:46 AM
పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతం రహదారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వెను వెంటనే రహదారి నిర్మాణాలకు అవసరమైన నిధులు విడుదలయ్యాయి. టూరిజం ప్రాజెక్టులో భాగంగా రూ.2 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో పర్యాటకులు, ప్రాంతీయ ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- కూటమి అధికారంలోకి రాగానే రూ.2 కోట్ల నిధులు విడుదల
- రహదారి పనులు ప్రారంభం
చింతపల్లి, జూలై 2: పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతం రహదారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వెను వెంటనే రహదారి నిర్మాణాలకు అవసరమైన నిధులు విడుదలయ్యాయి. టూరిజం ప్రాజెక్టులో భాగంగా రూ.2 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో పర్యాటకులు, ప్రాంతీయ ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ పరిధిలో యర్రవరం జలపాతం ఉంది. ఈ జలపాతానికి తురబాడుగెడ్డ నుంచి సమగిరి మీదుగా వెళ్లాలి. ఈ మార్గాన్ని ఆనుకుని సుమారు 12 గ్రామాలు ఉన్నాయి. తురబాడుగెడ్డ నుంచి సమగిరి వరకు తారురోడ్డు ఉంది. సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు వెళ్లేందుకు కేవలం మట్టిరోడ్డు మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంపై కేవలం ద్విచక్ర వాహనాలు మినహా ఆటోలు, కార్లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. ఈ ప్రాంత ఆదివాసీలు సైతం కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. శీతాకాలం సీజన్‌లో ఆంధ్రకశ్మీర్ లంబసింగికి వచ్చే పర్యాటకులు అధిక సంఖ్యలో యర్రవరం జలపాతాన్ని సందర్శిస్తుంటారు. పర్యాటకులు సమగిరి వరకు కార్లు, జీపుల్లో వచ్చి అక్కడ నుంచి కాలినడకన జలపాతానికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ మార్గం బురదమయమైపోతుంది. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. యర్రవరం జలపాతానికి రహదారిలేకపోవడం వల్ల ఆదివాసీలు, పర్యాటకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ గతంలో వరుస కథనాలను ప్రచురించింది. అయితే వైసీపీ ప్రభుత్వం రహదారి నిర్మాణాలకు నిధులు విడుదల చేయలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టూరిజం ప్రాజెక్టులో భాగంగా సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు నాలుగు కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నిర్మాణాలకు సంబంధించి నిధులు కూడా సకాలంలో విడుదలవుతాయనే నమ్మకంతో కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఎర్తువర్కు ప్రారంభించారు. ఎత్తువర్కు పూర్తికాగానే మెటల్, తారు రోడ్డు నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్ ఏఈఈ బాలకిశోర్ తెలిపారు.