Share News

కారిడార్‌ భూముల్లో పనులు

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:20 AM

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో సోమవారం మౌలిక వసతుల పనులు ప్రారంభమయ్యాయి.

కారిడార్‌ భూముల్లో పనులు

రహదారుల నిర్మాణం కోసం కొబ్బరి చెట్లు తొలగింపు

నిర్వాసితులు అడ్డుకోకుండా పోలీస్‌ బందోబస్తు

సీపీఎం నేత అప్పలరాజు గృహ నిర్బంధం

నక్కపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో సోమవారం మౌలిక వసతుల పనులు ప్రారంభమయ్యాయి. రాజయ్యపేట గ్రామం సర్వే నంబరు 292లో వున్న 244 ఎకరాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో రహదారుల నిర్మాణం కోసం కొబ్బరి, ఇతర జాతుల చెట్లను యంత్రాలతో కూల్చివేస్తున్నారు. అయితే తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందజేసి, న్యాయం చేసే వరకు కారిడార్‌ భూముల్లో పనులు చేపట్టవద్దని కొద్ది రోజుల నుంచి రైతులు, సీపీఎం నేతలు ఆందోళన చేస్తుండడంతో ముందుజాగ్రత్త చర్యగా నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట సీఐలు కుమారస్వామి, లొడ్డు రామకృష్ణ, జి.అప్పన్న నేతృత్వంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌.రాయవరం మండలం ధర్మవరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును గృహ నిర్బంధం చేశారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో చేపట్టిన పనులను నక్కపల్లి తహసీల్దార్‌ నరసింహమూర్తి, ఏపీఐఐసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలావుండగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును పోలీసులు గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ పార్టీ జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ హైవే జంక్షన్‌ వద్ద ఆందోళన చేశారు. కారిడార్‌ భూముల్లో పనులు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ, పక్కనే వున్న కాకినాడ జిల్లా ప్రజలు తిరస్కరించిన బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుకు నష్టపరిహారం చెల్లించి, ప్యాకేజీని అమలు చేయాలని, బల్క్‌డగ్ర్‌ పార్క్‌ను ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 31 , 2024 | 01:20 AM