Share News

మహిళా ఓటర్లే కీలకం

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:12 AM

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

మహిళా ఓటర్లే కీలకం
మహిళా ఓటర్లు

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వారే అధికం

పురుషుల కన్నా 35,584 మంది ఎక్కువ

అభ్యర్థుల విజయాన్ని శాసించేది వారే..

అతివల ఓట్ల కోసం పార్టీల వ్యూహరచన

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయాన్ని వీరే శాసించనున్నారు. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పురుషు ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 35,584 మంది ఎక్కువగా ఉన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే విజయంపై ప్రభావం చూపగలరని అన్ని పార్టీల అభ్యర్థులు నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలో వారి ఓటర్లను రాబట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బూడి ముత్యాలునాయుడు పేర్లు ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం జోరందుకుంది. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పెందుర్తి అసెంబ్లీ నియోజవర్గాలు ఉండగా, మొత్తం 15,72,430 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,68,423 మంది, మహిళా ఓటర్లు 8,04,007 మంది ఉన్నారు. 43 మంది ఇతరులు ఉన్నారు. పురుషులు కన్నా మహిళలు 35,584 ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులకు మహిళా ఓట్లు కీలకం కానున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పురుషుల కన్నా 7,404 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండగా, నర్సీపట్నంలో 6,424, చోడవరం 6,111, ఎలమంచిలి 5,384, మాడుగుల 4,630, పాయకరావుపేట 3,684, పెందుర్తి నియోజకవర్గంలో 1,947 మంది ఎక్కువగా ఉన్నారు.

మహిళా ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం

అనకాపల్లి పార్లమెంటరీ పరిఽధిలో దాదాపు అన్ని నియోజకవర్గాలు గ్రామీణ నేపథ్యం ఉన్నవే. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులతో పాటు అచ్యుతాపురం సెజ్‌లో పనిచేసే మహిళా ఓటర్లను తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఆయా రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. దీని కోసం ఇప్పటికే మహిళా సంఘాల ప్రతినిధులను కలిసి మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం నిర్వహించేందుకు సాధ్యమైనంత వరకు అటు కూటమి అభ్యర్థితో పాటు ఇటు వైసీపీ అభ్యర్థి కూడా పార్టీలో మహిళా కార్యకర్తలను ముందుంచి ఎన్నికల ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ సతీమణి సీఎం శ్రీదేవి అనకాపల్లి పట్టణంలో పలు వీధుల్లో మహిళా మోర్చా, తెలుగు మహిళ, జనసేన వీరమహిళలను కలుపుకొని ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో పార్లమెంట్‌ సిగ్మెంట్‌ పరిఽధిలో అన్ని నియోజకవర్గాల్లో మహిళలు సీఎం రమేశ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పురుష, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం ఇలా..

-----------------------------------------------------------------

నియోజకవర్గం పురుషులు మహిళలు వ్యత్యాసం

-----------------------------------------------------------------

అనకాపల్లి 1,01,744 1,09,148 7,404

చోడవరం 1,04,450 1,10,561 6,111

మాడుగుల 91,291 95,921 4,630

పెందుర్తి 1,48,555 1,50,502 1,947

ఎలమంచిలి 99,340 1,04,724 5,384

పాయకరావుపేట 1,21,911 1,25,595 3,684

నర్సీపట్నం 1,01,132 1,07,556 6,424

---------------------------------------------------------------

మొత్తం 7,68,423 8,04,007 35,584

----------------------------------------------------------------

Updated Date - Apr 06 , 2024 | 12:12 AM