ఆత్మరక్షణకు కర్రసాము
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:24 AM
కర్రసాము పట్ల ప్రస్తుతం బాలికలు, యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని తల్లిదండ్రులు కూడా అందుకు ప్రోత్సహిస్తున్నారు.
శిక్షణపై బాలికలు, యువతుల్లో పెరుగుతున్న ఆసక్తి
ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు
ఆత్మరక్షణతోపాటు ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదం
బరువు తగ్గడంతోపాటు కీళ్లు, ఎముకల పటుత్వం, ఏకాగ్రత మెరుగుపడేందుకు అవకాశం
నగరంలో పెరుగుతున్న కేంద్రాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కర్రసాము పట్ల ప్రస్తుతం బాలికలు, యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని తల్లిదండ్రులు కూడా అందుకు ప్రోత్సహిస్తున్నారు. కొందరైతే కర్రసాములో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలో పాల్గొని పతకాలను కొల్లగొడుతున్నారు.
కర్రసాముకు పురాతన చరిత్ర ఉంది. భారతదేశంలో క్రీస్తుపూర్వం నుంచి కర్రసాము ఉనికి ఉంది. అప్పటి ప్రజలు ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టేందుకు, జంతువుల దాడి నుంచి రక్షణకు కర్రసాము నేర్చుకునేవారు. కర్రసాముతో బరువు తగ్గడంతోపాటు కీళ్లు, ఎముకల పటుత్వం, ఏకాగ్రత పెరుగుతాయి. అలాగే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అనుకోని అపాయం ఎదురైతే సమర్థంగా ఎదుర్కొనగలమనే ఆత్మవిశ్వాసం కూడా కలుగుతుంది. అందుకే కొన్ని దశాబ్దాల కిందటి వరకూ కర్రసాముకు విశేషమైన ప్రాచుర్యం, ఆదరణ ఉండేవి. గ్రామాలు, పట్టణాల్లో కర్రసాము పోటీలు జరుగుతుండేవి. జాతరలు, పండుగలు జరిగితే కర్ర సాము ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కాలక్రమేణా కర్రసాము మరుగున పడిపోయింది. ఇటీవల కాలంలో తిరిగి కర్రసాము పట్ల యువత ఆసక్తిచూపడం మొదలుపెట్టారు. కర్రసాము వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుందని గుర్తిస్తున్నారు. పురుషులతో సమానంగా బాలికలు, యువతులు కూడా కర్రసాము నేర్చుకోడానికి పోటీపడుతున్నారు. నగరంలో ప్రస్తుతం నాలుగైదుచోట్ల కర్రసాము శిక్షణ కేంద్రాలు ఉండగా వాటిలో బాలికలు, యువతుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి వచ్చేంత వరకూ తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. విద్యార్థినుల నుంచి ఉద్యోగినుల వరకూ అందరిలోనూ ఎక్కడ ఆకతాయిలు ఏం చేస్తారోనని భయం వెన్నాడుతుంటుంది. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఆత్మరక్షణకు కర్రసాము బాగా ఉపయోగపడుతుందనే భావన చాలామంది తల్లిదండ్రులు, యువతుల్లో ఏర్పడుతోంది. దీంతో వ్యాయామంగా కూడా కర్రసామును గుర్తిస్తున్నారు. అందుకే కర్రసాము నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో కర్రసాములో నైపుణ్యం కలిగిన వారిలో కొందరు మరుగునపడిపోయిన ప్రాచీన యుద్ధకళను తిరిగి బతికించడానికి, భావితరాలకు ఆత్మరక్షణపై తర్ఫీదునిచ్చివారిలో ఆత్మవిశ్వాసం పెంచాలనే కోరికతో మరికొందరు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వీఎంఆర్‌డీఏ సెంట్రల్ పార్క్‌లో లక్ష్మణ్‌దేవ్ గత పదేళ్లుగా కర్రసాము నేర్పుతుండగా, ఇటీవల కాలంలో ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో రాము, బీచ్‌రోడ్డులో శ్రీను, వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కిరణ్ కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారిలో కొందరు రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లి పతకాలను సాధించడం విశేషం.
ఆత్మరక్షణకు ఎంతో అవసరం
పి.సంధ్య, ఎంబీఏ విద్యార్థిని
నేను మూడేళ్ల కిందట వ్యాయామంలో భాగంగా వాకింగ్ కోసం సెంట్రల్‌పార్కుకి వచ్చాను. అప్పుడు కర్రసాములో శిక్షణ ఇస్తుండడం చూసి ఆసక్తితో నేర్చుకోవడం ప్రారంభించాను. బాలికలు, యువతులతోపాటు మహిళలపై దాడులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆత్మరక్షణకు కర్రసాము నేర్చుకోవడం చాలా అవసరం. కర్రసాము నేర్చుకుంటే ఎలాంటి వారినైనా మట్టి కరిపించవచ్చు. కర్రసాములో నైపుణ్యం సాధిస్తే ఒకవైపు ఆత్మరక్షణతోపాటు ఆత్మవిశాసం పెరుగుతుంది. భవిష్యత్తులో నేను ఆడపిల్లలకు కర్రసాములో శిక్షణ ఇస్తాను.
కర్రసాముతో శరీర ధృడత్వం పెరిగింది!
ఎస్.మానస, ఇంజనీరింగ్ విద్యార్థిని
దాడులను అడ్డుకోవడానికి జరిగిన చర్చలో కర్రసాము ప్రస్తావన వచ్చింది. దీంతో ఎక్కడ శిక్షణ ఎక్కడ ఇస్తున్నారో స్నేహితుల ద్వారా తెలుసుకుని ఐదు నెలల కిందట ఇక్కడ చేరాను. కర్రసాము వల్ల ఎముకలు, కీళ్ల పటుత్వం పెరుగుతుంది. రక్తప్రసరణ సవ్యంగా జరగడంతో ఉత్సాహంగా ఉంటున్నాన. ఆత్మరక్షణలో భాగంగా ఎవరినైనా ఎదిరించగలననే నమ్మకం ఏర్పడింది.
కర్రసాముకు ఆదరణ పెరుగుతోంది: బీఏ లక్ష్మణదేవ్
ప్రాచీన భారతీయ యుద్ధకళను బతికించాలనే ఉద్దేశంతో పదేళ్ల కిందట కర్రసాములో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. మొదట్లో ఇద్దరు ముగ్గురే వచ్చేవారు. రానురాను సంఖ్య పెరిగింది. గత మూడేళ్లలో నేర్చుకునేందుకు వచ్చేవారిలో బాలికలు, యువతులు ఎక్కువగా ఉంటున్నారు. కొందరు ఒకవైపు సంప్రదాయ కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంటూనే..మరోవైపు కర్రలు తిప్పి ఎదుటివారి మక్కలు విరగ్గొట్టే కర్ర సాములో నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.