రాంకీ ఉపాధి హామీ హుళక్కేనా?
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:20 AM
ముత్యాలమ్మపాలెం పంచాయతీ మత్స్యకారులకు ఫార్మాసిటీలో ఉపాధి ఎండమావిగానే మిగిలిపోయింది. 500 మంది మత్స్యకారులకు దఫదఫాలుగా ఉపాధి కల్పిస్తామని రాంకీ యాజమాన్యం 12 ఏళ్ల క్రితం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేకపోయింది.
500 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన రాంకీ యాజమాన్యం
12 ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చని వైనం
ఆందోళనకు సిద్ధమవుతున్న మత్స్యకారులు
పరవాడ, జూలై 14: ముత్యాలమ్మపాలెం పంచాయతీ మత్స్యకారులకు ఫార్మాసిటీలో ఉపాధి ఎండమావిగానే మిగిలిపోయింది. 500 మంది మత్స్యకారులకు దఫదఫాలుగా ఉపాధి కల్పిస్తామని రాంకీ యాజమాన్యం 12 ఏళ్ల క్రితం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేకపోయింది. దీంతో మత్స్యకారులు ఫార్మాసిటీలోని రాంకీ కమర్షియల్ హబ్ ఎదుట ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఫార్మాసిటీ కాలుష్యం కారణంగా సమీపంలో ఉన్న తాడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఫార్మాసిటీ నుంచి వెదజల్లే రసాయనాల కారణంగా దుర్వాసన వెదజల్లేది. దీంతో తాడి గ్రామస్థులు గ్రామాన్ని తరలించాలని ఆందోళనలు చేపట్టేవారు. అలాగే ఫార్మాసిటీలో పరిశ్రమల వ్యర్థాలను రాంకీ యాజమాన్యం సీఈటీపీలో శుద్ధి చేసి అనంతరం పైపులైన్ ద్వారా తిక్కవానిపాలెం సముద్ర తీరంలో విడిచిపెట్టాలి. అయితే రాంకీ యాజమాన్యం ఫార్మా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టేది. దీని కారణంగా ముత్యాలమ్మపాలెం తీరంలో భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడేవి. దీంతో మత్స్యకారుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. పరవాడ మండలంలో తాడి తరలింపుతో పాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌లతో 2012లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, అప్పటి ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, అప్పటి ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల ముత్యాలు తదితరులు రాంకీ గేటు వద్ద ఆమరణ నిరాహర దీక్ష చేశారు. ఈ దీక్షలకు మండలంతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజల మద్దతు లభించింది. మూడు రోజుల పాటు ఆమరణ నిరాహరదీక్ష అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు రాంకీ యాజమాన్యం దిగొచ్చింది. తాడి గ్రామాన్ని తరలించడంతో పాటు ముత్యాలమ్మపాలెం మత్స్యకారులకు 500 మందికి దఫ దఫాలుగా ఫార్మాసిటీలో ఉపాధి కల్పిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. రాంకీ అప్పటి సీఈవో ఎఎన్ వీరారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 12 ఏళ్లు కావస్తోంది. ప్రభుత్వాలు మారినా మత్స్యకారుల ఉపాధి మాత్రం ఎండమావిగానే మిగిలిపోయింది. దీనికితోడు ఇటీవల ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరులో భారీ ఎత్తున చేపలు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీని కారణంగా మత్స్యకారులకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. ఫార్మా వ్యర్థ జలాల కారణంగానే చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు గగ్గోలు పెట్టారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కొనసాగుతుందేమోనన్న ఆందోళన మత్స్యకారుల్లో నెలకొంది. ఇప్పటికే ఫార్మా కాలుష్యంతో చేపల వేట కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. దీని వల్ల మత్స్యకారుల జీవనోపాధి అగమ్యగోచరంగా తయారైంది. వేట సాగక, ఉపాధి లేక కొంతమంది మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మత్స్యకారులు ఉపాధి కోసం రాంకీ వద్ద ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. రాంకీ ఇచ్చిన మాట ప్రకారం ఉపాధి కల్పించకపోతే తాడోపేడో తేల్చుకుంటామని మత్స్యకారులు చెబుతున్నారు. ఫార్మాసిటీ వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే కలుగజేసుకుని రాంకీ ఒప్పందం మేరకు మత్స్యకారులకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.