Share News

అరకులో గెలుపెవరిదో?

ABN , Publish Date - May 03 , 2024 | 01:37 AM

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్‌.కోట సెగ్మెంట్‌ పరిధిలో గల అరకులోయ, అనంతగిరి మండలాలు, పాడేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న డుంబ్రిగుడ, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలతో 2008లో అరకులోయ నియోజకవర్గం ఏర్పాటైంది.

అరకులో గెలుపెవరిదో?

నియోజకవర్గం ఏర్పాటయ్యాక మూడుసార్లు ఎన్నికలు

తొలిసారి టీడీపీ...ఆ తర్వాత రెండుసార్లు వైసీపీ అభ్యర్థుల విజయం

అరకులోయ, ఏప్రిల్‌ 27:

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్‌.కోట సెగ్మెంట్‌ పరిధిలో గల అరకులోయ, అనంతగిరి మండలాలు, పాడేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న డుంబ్రిగుడ, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలతో 2008లో అరకులోయ నియోజకవర్గం ఏర్పాటైంది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 2,32,337 మంది ఓటర్లు ఉన్నారు.

అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మూడు ధఫాలు ఎన్నికలు జరిగాయి. 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సివేరి సోమ 425 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి వంజంగి కాంతమ్మపై గెలుపొందారు. సోమకు 34,959 ఓట్లు రాగా, కాంతమ్మకు 34,554 వచ్చాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరిగి సివేరి సోమ పోటీ చేయగా, వైసీపీ తరపున కిడారి సర్వేశ్వరరావు నిల్చున్నారు. సోమపై సర్వేశ్వరరావు 34,053 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సర్వేశ్వరరావుకు 63,,700 ఓట్లు రాగా, సీవేరి సోమకు 29,647 వచ్చాయి. అయితే రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపత్యంలో మూడేళ్లు అనంతరం కిడారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు సర్వేశ్వరరావు, సోమ ఇద్దరూ మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చారు. వైసీపీ తరపున చెట్టి ఫాల్గుణ, ఇండిపెండెంట్‌గా సియ్యారి దొన్నుదొర పోటీ చేశారు. దొన్నుదొరపై ఫాల్గుణ 25,481 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెట్టి ఫాల్గుణకు 53,101 ఓట్లు రాగా, దొన్నుదొరకు 27,620 వచ్చాయి. ఎన్నికల అనంతరం దొన్నుదొర తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసారి దొన్నుదొరనే పార్టీ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ఆ తరువాత మారిన సమీకరణల్లో అరకులోయ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) తరపున పాంగి రాజారావు, వైసీపీ తరపున మత్స్యలింగం పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌తో సహా పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నా...బీజేపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ జరగనున్నది.

Updated Date - May 03 , 2024 | 01:37 AM