Share News

అమాత్యులెవరో?

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:18 AM

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది.

అమాత్యులెవరో?

విశాఖ జిల్లా నుంచి రేస్‌లో గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు

అనకాపల్లి జిల్లాలో అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత

జనసేన కోటాలో కొణతాలకు ఛాన్స్‌?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కూటమిలోని పార్టీలు అన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం దక్కనుంది. మంత్రి పదవులు ఎవరికి లభిస్తాయనే దానిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కూటమి పెద్దలు మాత్రం మంగళవారం రాత్రి వరకు ఎవరికీ ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. సామాజిక వర్గాలు, సీనియారిటీ, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు.

విశాఖపట్నం జిల్లా వరకు తీసుకుంటే ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు గంటా శ్రీనివాసరావు. ఆయన భీమిలి నుంచి 92 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరొకరు ఎన్నికల వరకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసి గాజువాక నుంచి 95 వేల మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు గతంలో రెండుసార్లు మంత్రి పదవులు నిర్వహించారు. పోర్టులు, మౌలిక వసతుల శాఖ, మానవ వనరుల (విద్యా) శాఖ నిర్వహించారు. ఇక యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి వస్తుందని బాగా ప్రచారం జరుగుతోంది. పార్టీ విధేయుడిగా ఉండడం, వైసీపీ ప్రలోభాలకు లొంగకపోవడం, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం...ఆయనకు అనుకూల అంశాలుగా చెబుతున్నారు. అయితే జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇస్తారని, గంటా లేదంటే పల్లా ఇద్దరిలో ఒకరికే ఛాన్స్‌ దక్కుతుందని అంటున్నారు.

అనకాపల్లి జిల్లాను తీసుకుంటే అక్కడ ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత. వీరిద్దరిలో ఒకరికే అవకాశం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. అయ్యన్నపాత్రుడు పార్టీలో సీనియర్‌. వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. కేసులు నమోదయ్యాయి. కోర్టుల ద్వారా రక్షణ పొందారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఉత్తరాంధ్రలో ఇదే సామాజిక వర్గం నుంచి ఇద్దరు సీనియర్లు ఉన్నారు. ఒకరు అయ్యన్నపాత్రుడు కాగా మరొకరు అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రలో ఈ సామాజిక వర్గానికి ఒకటే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అక్కడ అచ్చెన్నాయుడుకు పదవి దక్కితే ఇక్కడ అయ్యన్నకు అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది.

రెండోవారు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. పోలీసుల వేధింపులు ఎదుర్కొన్నారు. మహిళ, ఎస్సీ కోటాలో ఈసారి ఆమెకు పదవి గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది.

జనసేన నుంచి...

ఉత్తరాంధ్రాలో జనసేన పార్టీ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి నిమ్మక జయరాజు (ఎస్‌టీ), విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, పెందుర్తి నుంచి పంచకర్ల రమేశ్‌బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజకుమార్‌ గెలిచారు. ఉత్తరాంధ్ర నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. వీరిలో కొణతాల రామకృష్ణ సీనియర్‌. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో వాణిజ్య పన్నుల శాఖా మంత్రిగా చేశారు. ఆ తరువాత పంచకర్ల రమేశ్‌బాబు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజికవర్గం. మిగిలిన వారంతా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనవారు. ఈసారి యువతకు, కొత్తవారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. అదే నిజమైతే విశాఖ నుంచి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా నుంచి అనితకు పదవులు ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Jun 12 , 2024 | 01:18 AM