ఎక్కడ విఫలమయ్యాం?
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:47 AM
‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘సిద్ధం’ సభకు కనీసం మూడు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
జన సమీకరణలో ఎలా చతికిలపడ్డాం
సిద్ధం సభపై వైసీపీ నేతల పోస్టుమార్టం
జిల్లా నుంచి ఆశించిన స్థాయిలో ప్రజలను తరలించలేకపోయామని ఆవేదన
ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు వేలు అనుకుంటే రెండు వేలు మించలేదు
కేటాయించిన బస్సుల్లో కొన్ని ఐదు, పదిమందితోనే వెళ్లాయి
సమస్యను అధిగమించకపోతే అధినేతతో అంక్షితలు తప్పవు
అంతరంగిక సమీక్షలో నాయకుల నిట్టూర్పు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘సిద్ధం’ సభకు కనీసం మూడు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ గట్టిగా 30 వేలు దాటి జనాలను తీసుకురాలేకపోయాం. 15 రోజుల నుంచి జన సమీకరణపై కసరత్తు, సమీక్షలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. కేటాయించిన బస్సులను కొన్నిచోట్ల జనాలతో నింపలేకపోయాం. లోపం ఎక్కడ జరిగింది. దీనిని గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి అనుభవం ఎదురవకుండా జాగ్రత్తపడకపోతే అధినేతతో అంతా అక్షింతలు వేయించుకోవాల్సిందే.’ ఇదీ శనివారం సంగివలస వద్ద జరిగిన వైసీపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల సభపై వైసీపీ నేతల అంతరంగిక సమీక్షలో వ్యక్తంచేసిన అభిప్రాయాలు.
సార్వత్రిక ఎన్నికలకు ప్రచారానికి ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం చుట్టబోతున్నట్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెలరోజుల కిందట ప్రకటించారు. మూడు జిల్లాలకు అందుబాటులో ఉండేలా భీమిలి నియోజకవర్గంలోనే సభ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, ముఖ్యంగా జిల్లా నేతలు సంబరపడ్డారు. మూడు జిల్లాల పరిధిలోని వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులతోపాటు వలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహసారధులు గట్టిగా ప్రయత్నించి కనీసం మూడు లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీస్థాయిలో జనం హాజరవుతారనే ధీమాతో సభ జరిగే ప్రాంతం విశాలంగా, రవాణా సదుపాయం కలిగివుండాలని భీమిలి, ఆనందపురం మండలాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. చివరకు సంగివలస సమీపంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న వైసీపీ నేత అక్కరమాని వెంకటరావు కుటుంబసభ్యులకు చెందిన 14 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలంలో సభా వేదిక, వీఐపీలకు గదులు, సీఎం వాహనం వేదిక వద్దకు వచ్చిపోయేందుకు వీలుగా రోడ్డు, సభకు హాజరయ్యే జనాల మధ్యకు ముఖ్యమంత్రి వెళ్లి మాట్లాడేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదిక వంటి వాటి కోసం నాలుగు ఎకరాలు పోగా మిగిలిన పది ఎకరాలను జనాల కోసం సిద్ధం చేశారు. పది ఎకరాల్లో గరిష్టంగా 40 వేలు మంది మాత్రమే కుర్చీల్లో కూర్చొనేందుకు వీలుంటుందని భావించి, ముందుబాభాగంలో కుర్చీలు వేసి, వెనుక ఉన్న ప్రదేశాన్ని అలానే వదిలేశారు.
టార్గెట్ మరిచి ఏర్పాట్లు
మూడు లక్షల మందిని సభకు తరలించనున్నట్టు ప్రకటించిన వైసీపీ నేతలు సభకోసం ఎంపిక చేసిన స్థలంలో కేవలం 40 వేలు మంది మాత్రమే కుర్చునేందుకు వీలుంటుందనే విషయం తెలిసినప్పటికీ గుంభనంగా ఉండిపోయారు. తీరా సభ ప్రారంభయ్యే సరికి హాజరైనవారిలో కొందరు బయటకు వెళ్లిపోవడంతో వెనుకవైపు కుర్చీలు, ఇతర గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. సీఎం మాట్లాడుతుండగానే వేదికకు ఎదురుగా వెనుకవైపు ఖాళీగా ఉన్నకుర్చీలకుసంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో ట్రోల్ అయిపోవడంతో వైసీపీ నేతలు డీలాపడిపోయారు. సభకు కనీసం మూడు లక్షల మందిని తరలిస్తామని గొప్పగా ప్రకటనలు చేసినవారంతా అధిష్ఠానానికి దీనిపై ఎలా వివరణ ఇచ్చుకోవాలో తెలియక తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం కొందరు వైసీపీ నేతలు సభ జరిగిన తీరుతోపాటు, ఫీడ్‌బ్యాక్‌పై ఒకరినొకరు అడిగి తెలుసుకుంటూ అంతరంగికంగా సమీక్ష నిర్వహించుకున్నట్టు ఆపార్టీనేత ఒకరు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తేలేకపోయాం
ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు జిల్లా పరిధిలోనే ఉన్నందున ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వేల మందిని తరలించ గలిగినా సభా ప్రాంగణం నిండిపోయేదని నేతలు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. సభా ప్రాంగణంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉంటే కిక్కిరిసిపోయి జనాలురోడ్లపైకి వచ్చేసేవారని అభిప్రాయపడినట్టు తెలిసింది. దీనిప్రకారం చూసుకున్నా భీమిలి నియోజకవర్గం నుంచి పదివేలు, మిగిలిన ఆరు నియోజకవర్గాల నుంచి కనీసం ఐదు వేల మందిని తరలిస్తే సభ హిట్ అయ్యేదని నగరంలోని ఓ ముఖ్యనేత అభిప్రాయపడినట్టు సమాచారం. నగర పరిధిలోని కొన్ని ప్రాంతాలకు కేటాయించిన బస్సుల్లో కనీసం ఐదు, పది మంది కూడా లేకుండానే సభాప్రాంగణానికి చేరుకున్నాయని నామినేటెడ్ పోస్టులో ఉన్న ఒక నేత చెప్పినట్టు సమాచారం. నగర పరిధిలోని మరికొన్ని ప్రాంతాలకు కేటాయించిన బస్సులను ఆయా వార్డుల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు జనాలతో నింపడంపై దృష్టిపెట్టకుండా ముందుగానే సభాప్రాంగణానికి వెళ్లిపోవడం కూడా వైఫల్యానికి కారణమని జీవీఎంసీ పాలకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఒకరు ముఖ్యనేతల వద్ద కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులోనైనా పార్టీ సభలు, సమావేశాలకు జనాల తరలింపుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించకుండా, ఇప్పటిలాగే మహిళా సంఘాల సభ్యులు వస్తారనే ధీమాతో ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. లోపాలను అధిగమించుకోని పక్షంలో పార్టీ అధిష్ఠానం నుంచి అక్షింతలు వేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యనేత ఒకరు తనవద్ద సభ గురించి ప్రస్తావించిన వారిని హెచ్చరించినట్టు తెలిసింది.