Share News

కనెక్టింగ్‌ రోడ్డు ఎప్పటికి పూర్తయ్యేనో?

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:14 PM

కేవలం కిలో మీటరు మేర కనెక్టింగ్‌ రహదారి నిర్మాణం జరగకపోవడంతో మండలంలోని గోమంగి, బొంగరం పంచాయతీల్లోని పలు గ్రామాల ప్రజలు ఐదు కిలో మీటర్లు చుట్టూ తిరిగి గమ్యస్థానానికి చేరుకోవలసిన దుస్థితి నెలకొంది. వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోక పోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనెక్టింగ్‌ రోడ్డు ఎప్పటికి పూర్తయ్యేనో?
మర్రిపుట్టు సమీపంలో అధ్వానంగా ఉన్న రోడ్డు

సుమారు మూడేళ్లుగా నిలిచిన పనులు

బిల్లులు మంజూరుకాకపోవడంతో నిలిపివేసిన కాంట్రాక్టరు

గోమంగి, బొంగరం పంచాయతీ వాసులకు తప్పని ఇబ్బంది

కిలో మీటరు మేర రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో ఐదు కిలో మీటర్లు చుట్టూ తిరగాల్సిన దుస్థితి

పెదబయలు, ఏప్రిల్‌ 7: కేవలం కిలో మీటరు మేర కనెక్టింగ్‌ రహదారి నిర్మాణం జరగకపోవడంతో మండలంలోని గోమంగి, బొంగరం పంచాయతీల్లోని పలు గ్రామాల ప్రజలు ఐదు కిలో మీటర్లు చుట్టూ తిరిగి గమ్యస్థానానికి చేరుకోవలసిన దుస్థితి నెలకొంది. వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోక పోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెదబయలు మండలం గోమంగి పంచాయతీ ప్రధాన రహదారి నుంచి మర్రిపుట్టు మీదుగా బొంగరం పంచాయతీలోని పలు గ్రామాలకు వెళ్లడానికి ఒక కిలో మీటరు మేర కనెక్టింగ్‌ రోడ్డును 2020 అక్టోబరు నెలలో ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులు రూ.70 లక్షలు ఇందుకు కేటాయించారు. కాంట్రాక్టరు ఈ మార్గాన్ని చదును చేసి కంకర వేశారు. 2021 మే నెల వరకు పనులు చేపట్టారు. అయితే బిల్లులు మంజూరుకాకపోవడంతో కాంట్రాక్టరు పనులను నిలిపివేశారు. ఆ తరువాత వర్షాలు కురిసి కంకర కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు అధ్వానంగా తయారైంది. పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు వీలు లేకుండా ఉంది. వీరంతా గోమంగి నుంచి బొంగరం పంచాయతీకి రావాలన్నా, ఇటు నుంచి అటు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం లేక గుల్లెలు గ్రామం మీదుగా ఐదు కిలో మీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. జడ్పీటీసీ సభ్యుడి స్వగ్రామమైన గోమంగిలోనే రహదారి నిర్మాణం నిలిచిపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడు లేడని స్థానికులు అంటున్నారు. ఈ రహదారి ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:14 PM