Share News

సీబీఆర్‌ఎన్‌ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు ఎన్నడో?

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:48 AM

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో సెకండరీ లెవెల్‌ కెమికల్‌, బయోలాజికల్‌, రేడియోలాజికల్‌ అండ్‌ న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ పనులు ముందుకుసాగడం లేదు.

సీబీఆర్‌ఎన్‌ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు ఎన్నడో?

పారిశ్రామిక ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించే దిశగా కేంద్ర యోచన

దేశంలోని పది చోట్ల కెమికల్‌, బయోలాజికల్‌, రేడియోలాజికల్‌ అండ్‌ న్యూక్లియర్‌ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌

సెంటర్లు ఏర్పాటుకు నిర్ణయం

రాష్ట్రంలో విమ్స్‌లో ఏర్పాటుకు ప్రతిపాదన

రెండు ఎకరాలు కేటాయింపు

తమిళనాడులో వైద్యులకు శిక్షణ కూడా పూర్తి

ఏడాది దాటినా ముందుకుసాగని ప్రక్రియ

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో సెకండరీ లెవెల్‌ కెమికల్‌, బయోలాజికల్‌, రేడియోలాజికల్‌ అండ్‌ న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ పనులు ముందుకుసాగడం లేదు. పరిశ్రమల్లో ప్రమాదాలు, విపత్తులు వంటివి సంభవించినప్పుడు క్షత గాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీబీఆర్‌ఎన్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రాష్ట్రానికి కేటాయించిన సెంటర్‌ను విమ్స్‌లో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రతి పాదించింది. ఇందుకు రెండు ఎకరాల స్థలాన్ని కేటా యించింది. ఈ సెంటర్‌లో పనిచేయనున్న వైద్యులకు కేంద్రం శిక్షణ కూడా ఇచ్చింది. కానీ, ఆ తరువాత కేంద్రం నుంచి కదలిక లేదు.

అత్యాధునిక వైద్యానికి అవకాశం

ఈ సెంటర్‌ ఏర్పాటైతే ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. పరిశ్రమల్లో ప్రమాదాలు, గ్యాస్‌ లీకేజీలు, కెమికల్‌ విస్పోటనం వంటి ఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారికి అత్యాధునిక వైద్యం అందించేలా ఈ సెంటర్‌ను తీర్చిదిద్దుతారు. సాధారణ ఆస్పత్రుల్లో అందించే సేవలతో పోలిస్తే ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది. దీనివల్ల వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది. విశాఖ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సెంటర్‌ ఏర్పాటుకు విమ్స్‌ను ఎంపిక చేసింది. ముఖ్యంగా ఈ సెంటర్‌ లో మూడు రకాల వైద్య సేవలు అందుతాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు సెకండరీ లెవెల్‌ కెమికల్‌ విభాగంలో ఉండే వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. గ్యాస్‌ పేలుడు, కొవిడ్‌ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందినప్పుడు బయోలాజికల్‌ విభాగానికి చెందిన బృందం, పరిశ్రమల్లో రేడియేషన్‌కు సంబంధించిన పదార్థాల పేలుడు జరిగినప్పుడు రేడియోలాజికల్‌ విభాగం సిబ్బంది సేవలు అందిస్తారు. ఇందుకుగాను విమ్స్‌ వైద్యులకు నాలుగు నెలల కిందట తమిళనాడులో అడ్వాన్స్‌డ్‌ శిక్షణను అందించారు.

ఈ సెంటర్‌ ఏర్పాటులో భాగంగా విమ్స్‌లో ప్రత్యేకంగా న్యూక్లియర్‌ బ్లాక్‌ను ఏర్పాటుచేయనున్నారు. కానీ, ఆశించిన స్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ సెంటర్‌ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

Updated Date - Feb 27 , 2024 | 01:48 AM