Share News

ఏమిటీ గందరగోళం?

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:50 AM

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటనల నేపథ్యంలో మన్యంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తమ పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఇందులో భాగంగా అరకులోయకు పాంగి రాజారావును తమ అభ్యర్థిగా ప్రకటించింది.

ఏమిటీ గందరగోళం?
అరకులోయ బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు

అరకులోయ అసెంబ్లీ అభ్యర్థిగా పాంగి రాజారావును ప్రకటించిన బీజేపీ

రెండు నెలల క్రితమే దొన్నుదొరను తమ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు

బీజేపీకి పాడేరు అసెంబ్లీని కేటాయిస్తే, అరకులోయకు అభ్యర్థిని ప్రకటించడంపై టీడీపీ విస్మయం

పాడేరు అసెంబ్లీ స్థానం టీడీపీకి?

(పాడేరు- ఆంధజ్యోతి)

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటనల నేపథ్యంలో మన్యంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తమ పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఇందులో భాగంగా అరకులోయకు పాంగి రాజారావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు ప్రకటించిన దొన్నుదొర గ్రామాల్లో దూసుకుపోతుండడంతో తాజాగా బీజేపీ ప్రకటనతో టీడీపీ శ్రేణులు విస్మయం చెందుతున్నారు.

బీజేపీ ప్రకటనతో గందరగోళ పరిస్థితి

కూటమి పొత్తులో భాగంగానే అరకులోయ పార్లమెంట్‌ స్థానం, పాడేరు అసెంబ్లీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. ఈ ఉద్దేశంతోనే ఈ ఏడాది జనవరి 20న అరకులోయలో జరిగిన టీడీపీ రా కదలిరా... బహిరంగ సభలోనే తమ పార్టీ అరకులోయ అసెంబ్లీ అఽభ్యర్థి దొన్నుదొరేనని నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ఆయన తన నియోజకవర్గంలో ప్రచారం చేపడుతున్నారు. అలాగే అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలో టీడీపీ కచ్చితంగా విజయం సాధించే తొలి అసెంబ్లీ స్థానం అరకులోయేనని పార్టీ అధిష్ఠానం సైతం భావించింది. అలాగే పొత్తుగా భాగంగా బీజేపీ నుంచి అరకులోయ ఎంపీగా కొత్తపల్లి గీత, పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా కురుసా ఉమామహేశ్వరరావులు బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో అనూహ్యంగా బీజేపీ నేతలు అరకులోయ అసెంబ్లీ స్థానానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావును తమ అభ్యర్థిగా ప్రకటించారు. రెండు నెలల క్రితమే అరకులోయ టీడీపీ అభ్యర్థి ప్రకటన జరిగినప్పటికీ, తాజాగా అదే స్థానానికి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో గందరగోళ పరిస్థితులు ఏర్పడి మన్యంలోని కూటమి అభ్యర్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పాడేరు అసెంబ్లీ స్థానంలో టీడీపీకి?

అరకులోయ అసెంబ్లీ స్థానంపై గందరగోళం పరిస్థితి అలా ఉంటే... తాజా పరిణామం నేపథ్యంలో పాడేరు అసెంబ్లీ స్థానం టీడీపీకి కేటాయించేందుకు లైన్‌ క్లియర్‌ అయిందనే ప్రచారం ఏజెన్సీలో జరుగుతున్నది. ఇప్పటి వరకు పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారని,నేడో రేపో అభ్యర్థిని ప్రకటిస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా అరకులోయ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం కూటమి శ్రేణులను ఆశ్ఛర్యానికి గురి చేసింది. దీంతో స్థానిక అసెంబ్లీ స్థానం ఒక టీడీపీకే దక్కుతుందని నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీలో వున్న గ్రూపుల నేపథ్యంలో టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Mar 28 , 2024 | 12:50 AM