Share News

వద్దనాల్సింది పోయి.. వత్తాసు!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:52 AM

జిల్లా యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా?...అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది.

వద్దనాల్సింది పోయి.. వత్తాసు!

  • ఏయూలో అచీవర్స్‌ డే నిర్వహణపై అధికారుల తీరు

  • నిబంధనల ఉల్లంఘన కాదన్న జేసీ

  • గతంలో ఇదే తరహా సమావేశంపై ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న

  • పాఠశాల విద్యాశాఖ

  • ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి):

జిల్లా యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా?...అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఆది నుంచీ వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఎన్నికల వేళ అధికార పార్టీకి మేలుచేసేలా మరో కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నెల 26న అచీవర్స్‌ డే పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధంచేశారు. క్యాంపస్‌ ఎంపికల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ సమావేశంలో నియామక పత్రాలు అందించనున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహణ అధికార పార్టీకి మేలు చేస్తుందన్న వాదన ఉంది. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ ఏయూ పాలకులు పట్టించుకోవడం లేదు. పైగా సమావేశానికి ఎన్నికల కమిషన్‌ అనుమతి ఉందని చెబుతున్నారు. కాగా కొద్దిరోజుల కిందట పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ పాఠశాలల ముగింపు రోజున విద్యార్థులకు నివేదిక కార్డుల పంపిణీతోపాటు తల్లిదండ్రులతో విద్యార్థి కార్యకలాపాలు, పనితీరు చర్చించేలా పేరెంట్‌, టీచర్‌ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఉన్నతస్థాయి అధికారే ఎన్నికల నిబంధనల నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేయగా, ఏయూ అధికారులు మాత్రం పట్టుబట్టి మరీ నిర్వహించేందుకు కసరత్తు చేయడం విశేషం. కాగా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు తూర్పు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయనే స్పందిస్తూ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ టీమ్‌/వీడియో సర్వైలెన్స్‌ టీమ్‌ పర్యవేక్షణలోనే అచీవర్స్‌ డే నిర్వహిస్తారని, ఈ కార్యక్రమ నిర్వహణ ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించడం కిందకు రాదని పేర్కొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 08:04 AM