Share News

పెద్దాస్పత్రి అభివృద్ధి ఊసేది?

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:53 AM

అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి

పెద్దాస్పత్రి అభివృద్ధి ఊసేది?
అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి

- గత ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని సూపర్‌ స్పెషాలిటీగా తీర్చిదిద్దుతామని హామీలు

- అధికారంలోకి వచ్చాక పట్టించుకోని వైసీపీ ప్రజాప్రతినిధులు

- సిటీ స్కాన్‌ ల్యాబ్‌ను ప్రారంభించినా సిబ్బంది లేక అందుబాటులోకి రాని సేవలు

- వేధిస్తున్న వైద్య నిపుణుల కొరత, నిధుల లేమి

- ఇప్పటికీ అత్యవసర కేసులను విశాఖ కేజీహెచ్‌కి రిఫర్‌ చేయాల్సిన దుస్థితి

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

‘అధికారంలోకి రాగానే అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం. నిరుపేద రోగులు అత్యవసర వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి పరుగులు పెట్టాల్సిన పని లేకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం’.. ఇవీ గత ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు ఇచ్చిన హామీలు. అయితే వైసీపీ అధికారం చేపట్టి ఐదేళ్లు కావస్తున్నా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేకపోయింది. ఇక్కడ వైద్యుల కొరత, నిధుల లేమి కారణంగా అత్యవసర కేసులను ఇప్పటికీ కేజీహెచ్‌కి రిఫర్‌ చేయాల్సిన దుస్థితి నెలకొంది.

అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల నుంచి నిరుపేద రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ప్రతీ రోజు 800 నుంచి వెయ్యి వరకు అవుట్‌ పేషెంట్లు చికిత్సల కోసం వస్తుంటారు. గత ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని, వైద్య నిపుణులను నియమిస్తామని ప్రస్తుత ఎంపీ భీశెట్టి సత్యవతి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు.

వైద్య నిపుణుల కొరత

ఎన్టీఆర్‌ వైద్యాలయంలో 42 మంది వైద్య నిపుణులు ఉండాల్సి ఉండగా, ఇప్పటికీ జనరల్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు, ఈఎన్‌టీ, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, మానసిక వైద్య నిపుణుడు, సివిల్‌ సర్జన్‌, ఆర్‌ఎంఓ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అలాగే ఒక హెడ్‌నర్సు పోస్టు, 14 స్టాఫ్‌ నర్సు పోస్టులు, ఒక గ్రేడ్‌ వన్‌ ఫార్మశీ పోస్టు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు ఆస్పత్రి పరిపాలన విభాగాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు ఒకటి, జూనియర్‌ అసిస్టెంట్‌ 4, ఎక్స్‌రే టెక్నీషియన్‌ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తికాల సిబ్బంది లేక ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో తాత్కాలిక భృతిపై సిబ్బందిని నియమించుకొని నెట్టుకొస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అరకొరగా నిధులు విడుదల చేస్తుండడంతో ఆస్పత్రి నిర్వహణ భారంగా మారింది.

అందుబాటులోకి రాని సిటీస్కాన్‌ సేవలు

అదానీ గ్రూప్‌ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా గత ఏడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో ఆస్పత్రికి అధునాతన సిటీస్కాన్‌ యంత్రాన్ని సమకూర్చింది. ఇదే నెలలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ సత్యవతి ఈ యంత్రాన్ని ప్రారంభించారు. అయితే సిటీస్కాన్‌ ల్యాబ్‌ నిర్వహణకు ఒక మేనేజరు పోస్టు, ఇద్దరు టెక్నీషియన్లు, ముగ్గురు సహాయకులను నియమించాల్సి ఉండగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఇప్పటి వరకు సిటీస్కాన్‌ సేవలు అందుబాటులోకి రాలేదు.

నత్తనడకన క్రిటికల్‌ కేర్‌ ల్యాబ్‌ భవన నిర్మాణ పనులు

ఎన్టీఆర్‌ వైద్యాలయంలో రూ.22 కోట్ల అంచనాలతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్‌ కేర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. ఇందులో నాలుగు ఐసీయూ విభాగాలు, 50 పడకలు ఏర్పాటు కానున్నాయి. ఆస్పత్రికి సమీపంలోనే ఈ భవన నిర్మాణ పనులను చేపడుతున్నారు. అయితే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆస్పత్రి పరిస్థితిపై వైద్యాలయం సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా ఉన్నంతలో నిధులు వినియోగించుకుని రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. నిర్వహణ నిధుల పెంపు, సిటీస్కాన్‌ సిబ్బంది నియామకం, వైద్య నిపుణుల నియామకాల కోసం కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన చెప్పారు.

Updated Date - Apr 27 , 2024 | 12:53 AM