Share News

బంగ్లాదేశ్‌ నౌకకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:49 AM

బంగ్లాదేశ్‌ నౌక తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకువచ్చి మూడేళ్లు పూర్తయినా దానికి ఇంకా మోక్షం కలగలేదు.

బంగ్లాదేశ్‌ నౌకకు మోక్షమెన్నడో?

పర్యాటక ప్రాజెక్టుగా మారుస్తామని మూడేళ్ల కిందట పాలకుల ప్రకటన

అనుమతుల కోసం అప్పటినుంచీ ప్రయత్నాలు

ఇప్పటికీ అతీగతి లేదు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బంగ్లాదేశ్‌ నౌక తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకువచ్చి మూడేళ్లు పూర్తయినా దానికి ఇంకా మోక్షం కలగలేదు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటక శాఖా మంత్రిగా ఉండగా దానిని ప్రజా సందర్శనకు వీలుగా మారుస్తామని ప్రకటించారు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కొత్త పర్యాటక శాఖా మంత్రి దాని గురించి ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు. అధికారులు మాత్రం ఫైల్‌ మీద ఫైల్‌ పెడుతూ దానిని ఎలాగోలా వినియోగంలోకి తేవాలని యత్నిస్తున్నారు. అవి ఎప్పటికి ఫలిస్తాయో!!

తుఫాన్‌ గాలులకు మూడేళ్ల క్రితం తెన్నేటి పార్కు తీరానికి బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక ‘ఎంవీ మా’ కొట్టుకువచ్చింది. వెనక్కి తీసుకువెళ్లే మార్గం లేకపోవడంతో అలాగే వదిలేయాలని సంస్థ నిర్ణయించింది. ఆ నౌకను పర్యాటకంగా ఉపయోగించుకోవాలని అప్పటినుంచీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. నౌకను యాజమాన్యం నుంచి గిల్‌మెన్‌ సంస్థ తీసుకుంది. ఏపీ పర్యాటక శాఖతో గిల్‌మెన్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. నౌకను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారుచేసి ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిని రెండు దశల్లో అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. కురుసుర సబ్‌మెరైన్‌ను ఎలాగైతే పర్యాటక ప్రాజెక్టుగా మార్చారో...దీనిని కూడా అలాగే తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వాణిజ్య నౌక ఎలా ఉంటుంది?, అందులో యంత్రాలు, క్రూ (సిబ్బంది) గదులు, సరకు రవాణాకు నౌకను ఎలా ఉపయోగిస్తారు?...వంటి అంశాలు సాధారణ ప్రజలకు వివరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. లభించే ఆదరణను బట్టి ఆ తరువాత దశలో రెస్టారెంట్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ వంటి అంశాలు జోడించాలని అనుకున్నారు.

రెండు అనుమతుల కోసం యత్నం

తీరానికి కొట్టుకువచ్చిన నౌక వద్దకు జోడుగుళ్లపాలెం బీచ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అదంతా ఇసుక. రహదారి వేయాలి. ఆ ప్రాంతం అటవీ శాఖకు సంబంధించినది కావడంతో వారి అనుమతి కోసం ఫైలు పంపించారు. సుమారు 0.5 హెక్టార్ల భూమి కావాలని, పర్యాటక అవసరాలకు ఉపయోగిస్తామని రాశారు. ఇక్కడి జిల్లా అటవీ శాఖాధికారి నుంచి కేంద్ర కార్యాలయం వరకూ దానిని పరిశీలించాల్సి ఉంది. ఇటీవల ఈ ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యతో ఆ పోర్టల్‌ ఆగింది. సమస్య పరిష్కారం అయిన వెంటనే అనుమతి లభిస్తుందని పర్యాటక శాఖాధికారులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

సీఆర్‌జెడ్‌ బోర్డు సమావేశంలో కొర్రీలు

నౌక నిలిచిపోయిన ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) పరిధిలో ఉంది. అక్కడ ఎటువంటి కార్యక్రమం చేపట్టాలన్నా వారి అనుమతి కూడా అవసరం. ఈ ఫైల్‌ను కూడా అక్కడకు పంపించారు. ఇటీవల జరిగిన సీఆర్‌జెడ్‌ బోర్డు సమావేశంలో ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని మరిన్ని వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. తరువాత జరిగే బోర్డు సమావేశంలో వాటిపై చర్చించాక అనుమతిపై నిర్ణయం తీసుకుంటారు.

ప్రజలకు మంచి అనుభూతి ఇవ్వాలనే...

శ్రీనివాస పాని, రీజనల్‌ డైరెక్టర్‌, పర్యాటక శాఖ

ఎందుకూ ఉపయోగపడని నౌకను పర్యాటకంగా ఉపయోగించుకుంటే మరో కురుసుర సబ్‌మెరైన్‌లా అందరికీ చక్కటి అనుభూతిని ఇస్తుందని ప్రభుత్వం తరపున యత్నిస్తున్నాము. అనుమతులు చివరి దశలో ఉన్నాయి. రాగానే మ్యూజియంగా, రెస్టారెంట్‌గా తీర్చిదిద్దుతాము. ఇవన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ పనులు కావడం వల్ల బయట అన్నీ తయారుచేసి ఇక్కడికి తెచ్చి నౌకలో ఏర్పాటుచేస్తారు.

Updated Date - Jan 17 , 2024 | 12:49 AM