Share News

అధికారులకు చెత్తశుద్ధి ఏది?

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:24 AM

పారిశుధ్య సమస్య, దుర్గంధం, దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య విభాగం అధికారి, పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం నిర్మించిన కంపోస్టు యార్డు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

అధికారులకు చెత్తశుద్ధి ఏది?
నర్సీపట్నం మునిసిపాలిటీ కంపోస్ట్‌ యార్డు

- పట్టణంలో అపరిష్కృతంగా పారిశుధ్య సమస్య

- తొమ్మిదేళ్ల క్రితం కంపోస్టు యార్డు నిర్మించినా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాని వైనం

- కౌన్సిల్‌లో ప్రతిపక్షాలు నిలదీస్తున్నా పట్టించుకోని పాలకులు, అధికారులు

నర్సీపట్నం, మార్చి 28 : పారిశుధ్య సమస్య, దుర్గంధం, దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య విభాగం అధికారి, పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం నిర్మించిన కంపోస్టు యార్డు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

వార్డుల్లో ఎక్కడికి వెళ్లినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్త సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళితే రకరకాల కారణాలు వెతక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చెత్తను కంపోస్ట్‌ యార్డుకి తరలించడానికి రోడ్డు మార్గం లేదని ఇప్పటి వరకు వంకలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అయినా చెత్త సమస్య పరిష్కారం కాలేదు. ఇందిరా మార్కెట్‌ను డంపింగ్‌ యార్డుగా మార్చేశారు. ఊర్లో చెత్తను తీసుకొచ్చి మార్కెట్‌ ఆవరణలో పోస్తున్నారు. దాన్ని ఆనుకొనే మాంసం దుకాణాలు నడుపుతున్నారు. పట్టణంలోని చెత్త సమస్య మీద కౌన్సిల్‌ సమావేశంలో జనసేన, టీడీపీ కౌన్సిలర్లు ప్రతీ నెలా అధికారులను నిలదీస్తున్నా స్పందించడం లేదు.

నిరుపయోగంగా కంపోస్ట్‌ యార్డు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 సంవత్సరంలో బలిఘట్టంలోని వరహానదిని ఆనుకొని రూ.1.5 కోట్లతో సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు(కంపోస్టు యార్డు) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కాగా స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పథకంలో తడి, పొడి చెత్తను వేరు చేయాలి. తడి ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు రాయితీ మీద సరఫరా చేయాలి. 2017 ఆగస్టులో క్యూబ్‌ బయో ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు కంపోస్టు యార్డు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థలో మునిసిపాలిటీ చేసుకున్న ఒప్పందం ప్రకారం రోజుకి 10 టన్నుల తడి చెత్తను అప్పగించాలి. వార్డులో తడి, పొడి చెత్త సేకరణ జరగకపోవడంతో పూర్తి స్థాయిలో తడి చెత్తను సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో నామమాత్రంగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్టు యార్డు నడుపుతున్నారు.

రోడ్డు లేదని ఇప్పటి వరకు వంకలు

కంపోస్టు యార్డులోకి చెత్తను తరలించడానికి రోడ్డు లేదని అధికారులు వంకలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రోడ్డు అందుబాటులోకి వచ్చింది. గత నెలలో భూసేకరణ ద్వారా రైతుకు రూ.10 లక్షలు చెల్లించి రోడ్డుకి అవసరమైన 15 సెంట్లు స్థలాన్ని తీసుకున్నారు. లింగాపురం గ్రామానికి, కంపోస్టు యార్డుకి ఉపయోగపడే విధంగా 20 అడుగులు వెడల్పున 378 అడుగులు పొడవున రోడ్డు ఏర్పాటు చేశారు. రోడ్డు అందుబాటులోకి వచ్చినా పట్టణంలో చెత్త సమస్య పరిష్కారం కాలేదు.

తడి, పొడి చెత్త సేకరణ ఏదీ?

నర్సీపట్నం మునిసిపాలిటీలోని 28 వార్డుల్లో 19,670 ఇళ్లు ఉన్నాయి. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా అందించడానికి ప్రతీ ఇంటికి మూడు డస్ట్‌బిన్‌లు పంపిణీ చేయడానికి ఏడాదిన్నర క్రితం 60 వేలు ప్లాస్టిక్‌ డబ్బాలు రూ.31.58 లక్షలతో కొనుగోలు చేశారు. తడి, పొడి చెత్త సేకరణలో ప్రజారోగ్య విభాగం అధికారులు నిర్లక్ష్యం కారణంగా పథకం నీరుగారిపోయింది. ఇంటింటికి పంపిణీ చేసిన డస్ట్‌బిన్‌లు వృథా అయ్యాయి. ప్రజలు వాటిని తడి, పొడి చెత్త కోసం ఉపయోగించడం లేదు. పారిశుధ్య కార్మికులు వీధిలోకి వచ్చినప్పుడు తడి, పొడి చెత ్తను వేరు చేసి ఇవ్వడం లేదు. కంపోస్టు యార్డు వినియోగంలో లేని కారణంగా అధికారులు తడి, పొడి చెత్త కార్యక్రమాన్ని గాలికి వదిలేశారు. తడి చెత్తను సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగించి, మిగిలిన గాజు పెంకులు, ప్లాస్టిక్‌ కవర్లు, టైర్లు తదితర ఘన వ్యర్థాలు వేరు చేసి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌కి పంపించాలి. విజయవాడకు చెందిన తరుణి అసోసియేట్స్‌ సంస్థకు రెండేళ్ల క్రితం కాంట్రాక్టు ఇచ్చారు. సదరు సంస్థ పొడి చెత్త తరలించడం లేదు. కంపోస్ట్‌ యార్డులో పొడి చెత్త కొండలా పేరుకుపోయింది. పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే కలుగజేసుకొని కంపోస్ట్‌ యార్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ చిట్టిబాబును వివరణ కోరగా కంపోస్ట్‌యార్డు లోపల వాహనాలు రాకపోకలకు సీసీ రోడ్లు నిర్మించలేదని తెలిపారు. పొడి చెత్తను అక్కడ నుంచి తరలించేందుకు ఇంజనీరింగ్‌ విభాగం చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Updated Date - Mar 29 , 2024 | 12:24 AM