Share News

ఏ నిమిషానికి ఏమి జరుగునో?

ABN , Publish Date - May 29 , 2024 | 12:59 AM

స్థానిక బలిఘట్టం పాత పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉంది. దీని పైఅంతస్థులో సచివాలయం నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ శ్లాబ్‌, గోడల పెచ్చులూడిపోయి పరిస్థితి దారుణంగా ఉంది. ఏ క్షణంలోనైనా భవనం కూలిపోయే విధంగా ఉంది. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ పనులపై వచ్చే జనం కూడా భయాందోళన చెందుతున్నారు.

ఏ నిమిషానికి ఏమి జరుగునో?
శిథిల భవనంలో ఉన్న బలిఘట్టం సచివాలయం

- శిథిల భవనంలో బలిఘట్టం సచివాలయం

- బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు

- వివిధ పనులపై వచ్చే జనంలోనూ భయం

- పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు

నర్సీపట్నం, మే 28: స్థానిక బలిఘట్టం పాత పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉంది. దీని పైఅంతస్థులో సచివాలయం నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ శ్లాబ్‌, గోడల పెచ్చులూడిపోయి పరిస్థితి దారుణంగా ఉంది. ఏ క్షణంలోనైనా భవనం కూలిపోయే విధంగా ఉంది. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ పనులపై వచ్చే జనం కూడా భయాందోళన చెందుతున్నారు.

బలిఘట్టం పంచాయతీ కార్యాలయం కోసం 1985లో ఈ భవనాన్ని నిర్మించారు. 2011లో నర్సీపట్నం మునిసిపాలిటీ అయిన తరువాత ఈ భవనం కూడా మునిసిపాలిటీ ఆధీనంలోకి వచ్చింది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత ఈ భవనం పై అంతస్థులో సచివాలయం-11 ఏర్పాటు చేశారు. ఇందులో పది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బలిఘట్టం 17, 18 వార్డుల పరిధిలోని 25 క్లస్టర్లుకు సంబంధించి సుమారు 5వేల మంది ప్రజలు వివిధ అవసరాల మీద సచివాలయానికి వస్తుంటారు. ఈ భవనానికి ఆనుకొని డివిజినల్‌ పంచాయతీ కార్యాలయం, వెనుక భాగంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ తాగునీరు విశ్లేషణా ప్రయోగశాల ఉన్నాయి. పారిశుధ్య కార్మికులు ఈ భవనాన్ని గోదాముగా వినియోగిస్తున్నారు. తమ పని సామగ్రిని ఇక్కడే భద్రపరుచుకుంటారు. మునిసిపాలిటీలో కాలం చెల్లిన భవనాలు ఉంటే నివాస యోగ్యం కాదని యజమానులకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించే అధికారులు పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో సచివాలయం ఎలా నిర్వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జరగరాని నష్టం జరిగితే.. ?

వచ్చేది వర్షాకాలం... భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయే స్థితిలో ఉంది. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శ్లాబ్‌ పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. బిల్డింగ్‌ ముందు భాగంలో ఉన్న సన్‌షేడ్‌ కూలిపోయే దుస్థితిలో ఉంది. గోడలు ప్లాస్టింగ్‌ ఊడిపోయి రాతి కట్టుబడి కనిపిస్తున్నది. సన్‌షేడ్‌ కాంక్రీట్‌ పెచ్చులు ఊడి పోతున్నాయి. భారీ వర్షాలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ భవనం పైఅంతస్థులో ఉన్న సచివాలయాన్ని వెంటనే వేరే చోటికి మార్చాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకుందామంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు అడుగుకి రూ.6లు చొప్పున వెయ్యి చదరపు అడుగుల భవనానికి ప్రభుత్వం రూ.6 వేలు అద్దె చెల్లిస్తుంది. బలిఘట్టంలో సచివాలయం కార్యాలయానికి సరిపడా భవనం అద్దెకు కావాలంటే రూ.10 వేలు ఉంటుంది. దీంతో అద్దె భవనాల్లోకి కార్యాలయాన్ని తరలించడం వీలు పడడం లేదు. దీని వల్ల కూలిపోయే స్థితిలో ఉన్న భవనంలోనే సచివాలయ ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - May 29 , 2024 | 12:59 AM