Share News

ఎన్నికలు సజావుగా జరిగేలా పక్కా ప్రణాళిక

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:47 AM

ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికను ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నియమావళిని తూచా తప్పకుండా పాటిస్తామన్నారు.

ఎన్నికలు సజావుగా జరిగేలా పక్కా ప్రణాళిక
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

- అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

- కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణ

- అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిరంతర నిఘా

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

అనకాపల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికను ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నియమావళిని తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. 1,529 పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన పనులు నూరు శాతం పూర్తయ్యాయని చెప్పారు. తుది ఓటర్ల జాబితాలో ఓట్ల నమోదు, చేర్పులు, మార్పుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేస్తున్నామన్నారు. కొత్త ఓటర్ల చేర్పులకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఇప్పటికే చేర్పులు, మార్పుల కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో ఒకటికి రెండు సార్లు చర్చించిన తరువాతే ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులు జరపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.

అనకాపల్లిలోనే ఓట్ల లెక్కింపు

అనకాపల్లిలో శంకరం గ్రామంలో జిల్లా పోలీసు కార్యాలయానికి ఆనుకొని వున్న భవనంలోనే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, పార్లమెంట్‌కు సంబంధించి 7 (పెందుర్తితో కలిపి) నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఇక్కడే జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు

కలెక్టర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. సి-విజిల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పౌరులు ఫిర్యాదులు చేయవచ్చునని చెప్పారు. ఆర్వోలకు నేరుగా అందిన ఫిర్యాదులు, దినపత్రికలలో వచ్చిన ప్రతికూల వార్తలకు సంబంధించి ఫిర్యాదులను వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎన్నికలకు సంబంధించి 24 గంటలూ ఫిర్యాదులు స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950, ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ నంబర్‌: 08924-226599 లకు ఫోన్‌ చేసి ఎన్నికలకు సంబంధిచిన ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు.

అభ్యర్థుల ప్రకటనలు, ఖర్చులపై నిఘా

ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.95 లక్షలు, అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షలు వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. నామినేషన్‌ తేదీ నుంచి ఫలితాలు వెల్లడించే రోజు వరకు చేసిన ఖర్చు మొత్తాలకు ప్రత్యేక అకౌంట్‌ నిర్వహించి రిటర్నింగ్‌ అధికారి లేదా వ్యయ పరిశీలకులకు రోజువారీ నివేదిక అందించాలని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతి పొందేందుకు ప్రత్యేకంగా సువిధ యాప్‌ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అభ్యర్థి పార్టీ లేదా సొంతంగా గానీ తాను సేకరించిన మొత్తం లేదా విరాళం వివరాలను జమగా చూపించాల్సి ఉంటుందన్నారు. వాహనాలు, సభలు, సమావేశాల నిర్వహణ, అన్ని విధాలా ప్రకటనలు, కమిషన్‌ నిర్ణయించిన రేట్లను అనుసరించే లెక్కిస్తారని చెప్పారు.

Updated Date - Apr 05 , 2024 | 12:47 AM