Share News

జగన్‌కు స్వాగతం

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:17 AM

విజయనగరం జిల్లా పర్యటన నిమిత్తం గురువారం విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఎయిర్‌పోర్టులో వైసీపీ జిల్లా నేతలు స్వాగతం పలికారు.

జగన్‌కు స్వాగతం

గోపాలపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

విజయనగరం జిల్లా పర్యటన నిమిత్తం గురువారం విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఎయిర్‌పోర్టులో వైసీపీ జిల్లా నేతలు స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి జగన్‌ హెలికాప్టర్‌లో గుర్ల వెళ్లారు. డయేరియా బాధితులను పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి విశాఖ చేరుకున్నారు. ఇక్కడ నుంచి 2.55 గంటలకు బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌ పోర్టులో జగన్‌ను మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌, తదితరులు కలిశారు.

డీఆర్వోగా భవానీశంకర్‌

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పూర్తిచేసుకున్న బీహెచ్‌ భవానీశంకర్‌ను నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న కె.మోహన్‌కుమార్‌ను చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించారు. ఇంకా నగరంలో సివిల్‌ డిఫెన్స్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.పద్మలతను అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారిగా, భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ టి.సీతారామమూర్తిని తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేశారు. ఇటీవల వరకు సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసి ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాసమూర్తిని విజయనగరం డీఆర్వోగా బదిలీ చేశారు.

డీఈవోగా ప్రేమ్‌కుమార్‌

గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌ ప్రిన్సిపాల్‌గా చంద్రకళ

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారిగా విజయనగరం డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుత విశాఖ డీఈవో ఎల్‌. చంద్రకళకు గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌ ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్‌ ఇస్తూ అదనంగా పల్నాడు డీఈవో బాధ్యతలు అప్పగించారు. చంద్రకళ సుమారు మూడేళ్ల నుంచి విశాఖ డీఈవోగా పనిచేస్తున్నారు. తొలుత ఉమ్మడి జిల్లా డీఈవోగా వచ్చారు. జిల్లాల విభజన తరువాత విశాఖ డీఈవోగా కొనసాగారు.

ప్రమాణాలు పెంచుతాం..

విశాఖపట్నం డీఈవోగా పోస్టింగ్‌ పొందిన ప్రేమ్‌కుమార్‌కు ఉమ్మడి విశాఖ జిల్లాతో అనుబంధం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ మూడు దశాబ్దాల క్రితం పాఠశాల విద్యా శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా సర్వీస్‌ ప్రారంభించి తరువాత 2016లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. విశాఖలో ఏడీగా పనిచేసిన తరువాత ఎలమంచిలి డిప్యూటీ డీఈవోగా వెళ్లారు. జిల్లాల విభజన సమయంలో పార్వతీపురం మన్యం డీఈవోగా బదిలీపై వెళ్లిన ప్రేమ్‌కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయనగరం డీఈవోగా వచ్చారు. విశాఖ డీఈవోగా పోస్టింగ్‌ పొందిన ప్రేమకుమార్‌ గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచుతామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తామని, ఇప్పటికే విద్యా శాఖ రూపొందించిన ప్రణాళికను అమలుపరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 01:17 AM