Share News

వీక్లీ ఆఫ్‌లు మూన్నాళ్ల ముచ్చటే!

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:15 AM

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి, ఆ తరువాత నాలుక మడతేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి పోలీస్‌ సిబ్బందికి ఇచ్చిన మాట కూడా తప్పారు.

వీక్లీ ఆఫ్‌లు మూన్నాళ్ల ముచ్చటే!

ఖాకీలకు హ్యాండిచ్చిన జగన్‌

అధికారంలోకి వస్తే పోలీస్‌ శాఖలో వీక్లీ ఆఫ్‌ తీసుకునే విధానం తీసుకువస్తానని హామీ

పది నెలలు అమలుచేసి తర్వాత ఎత్తివేత

నెలనెలా దాచుకున్న జీపీఎఫ్‌ డబ్బుల కోసం ఎదురుచూపులే

పోలీసుల్లో తీవ్ర అసంతృప్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి, ఆ తరువాత నాలుక మడతేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి పోలీస్‌ సిబ్బందికి ఇచ్చిన మాట కూడా తప్పారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తామని చెప్పిన జగన్‌ కొంతకాలం అమలు చేసి, ఆ తర్వాత ఎత్తేశారు.

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌ నుంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకూ సుమారు 3,500 మంది పనిచేస్తున్నారు. వీరంతా నిత్యం విధి నిర్వహణలో ఉండాల్సిందే. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అధికారిక సెలవులు, వారాంతపు సెలవులు ఉన్నప్పటికీ పోలీస్‌ శాఖలో మాత్రం వాటిని పొందే అవకాశం ఉండదు. నిత్యం పని ఒత్తిడిలో మునిగితేలే తమకు కూడా వారంతాపు సెలవు ఇవ్వాలంటూ పోలీస్‌ శాఖలో చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. 2019 ఎన్నికల సమయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి పోలీస్‌ శాఖలో కూడా వారాంతపు సెలవులు అమలుచేయాల్సిన అవసరం ఉందని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో చాలామంది పోలీసులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కానిస్టేబుల్‌ నుంచి సీఐ స్థాయి వరకూ వారాంతపు సెలవు తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనిప్రకారం పోలీస్‌ శాఖలో ఏపీఎస్‌పీ, సివిల్‌ విభాగాల్లో అంతర్గతంగా పనిచేసేవారు, సెక్షన్‌ డ్యూటీలు చేసేవారు, ఎస్‌ఐ, సీఐలు ఇలా మూడు కేటగిరీలుగా విభజించి ప్రతి ఒక్కరూ వారం లేదా పది రోజులకు ఒకసారి వారాంతపు సెలవు పొందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. వారాంతపు సెలవు తీసుకునే అవకాశం రావడంతో పోలీస్‌ శాఖలో ప్రధానంగా కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐ స్థాయి సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వీక్లీ ఆఫ్‌ అందుబాటులోకి వచ్చిందంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ఆనందం వారికి ఎంతోకాలం నిలవలేదు. కొద్దినెలల్లోనే బందోబస్తులు, అత్యవసర విధులు, ప్రముఖల పర్యటనల పేరుతో వీక్లీఆఫ్‌ను క్రమంగా పక్కన పెట్టేశారు. వీక్లీఆఫ్‌లను మూన్నాళ్ల ముచ్చటగా మార్చేశారు. దీనిపై పోలీసులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత తిరిగి అమలు చేస్తారని భావించినా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించిన పాపాన కూడా పోలేదు.

జీపీఎఫ్‌ కోసం ఎదురుచూపులే

పోలీస్‌ శాఖలో ఉద్యోగులంతా భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి నెలా జీతంలో కొంత మొత్తాన్ని జీపీఎఫ్‌లో పొదుపు చేసుకుంటారు. ఉద్యోగి దాచుకున్న మొత్తానికి సమాన వాటాను రాష్ట్ర ప్రభుత్వం జీపీఎఫ్‌లో ఉద్యోగి పేరిట జమ చేయాలి. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం వంటి అవసరాల కోసం విత్‌డ్రా చేసుకుంటారు. కానీ ప్రస్తుతం జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బును తీసుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. నగర పోలీస్‌ కమిషనరేట్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు గత రెండేళ్లుగా జీపీఎఫ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాము దాచుకున్న డబ్బును అవసరమైనప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాము దాచుకున్న డబ్బును ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవడం వల్లే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని వస్తోందని వాపోతున్నారు. జీపీఎఫ్‌ రాకపోవడంతో అప్పులు వాడుకుని ఆయా కార్యక్రమాలను పూర్తిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొంతమంది పోలీస్‌ సిబ్బంది వాపోతున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 02:15 AM