Share News

గ్రామాన్ని తరలిస్తేనే ఎన్నికల్లో పాల్గొంటాం

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:15 AM

వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించే విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని మండలంలోని తాడి గ్రామస్థులు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిట్నరింగ్‌ అధికారిణి శేషశైలజకు తేల్చి చెప్పారు.

గ్రామాన్ని తరలిస్తేనే ఎన్నికల్లో పాల్గొంటాం
తాడి గ్రామస్థులతో సమావేశమైన పెందుర్తి ఆర్‌వో శేషశైలజ

పెందుర్తి ఆర్‌ఓకు తేల్చి చెప్పిన తాడి గ్రామస్థులు

పరవాడ, ఏప్రిల్‌ 16: వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించే విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని మండలంలోని తాడి గ్రామస్థులు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిట్నరింగ్‌ అధికారిణి శేషశైలజకు తేల్చి చెప్పారు. ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తమ గ్రామాన్ని తరలించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఇందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తాడి గ్రామస్థులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మంగళవారం తాడి గ్రామంలో ఆమె ‘సీప్‌’ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలుష్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, సార్వత్రిక ఎన్నికలకు సహకరించాలని కోరారు. దీంతో పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ, తమ సమస్యను గతంలోనే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లామని, మీరు మరోసారి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామాన్ని తరలిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. రిట్నరింగ్‌ అధికారిణి శేషశైలజ ప్రతిస్పందిస్తూ.. గ్రామ తరలింపునకు ఎలాంటి హామీ ఇవ్వలేనని, మరోసారి ఆలోచించుకుని ఎన్నికల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, మాజీ సర్పంచ్‌ బొడ్డపల్లి అప్పారావు, నాయకులు కోమటి అచ్చిబాబు, కోమటి సూరిబాబు, గనిరెడ్డి కనకారావు, పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ బాలసూర్యారావు, తహసీల్దార్‌ గణపతిరావు, ఎంపీడీవో కీర్తిస్పందన, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 01:15 AM