గంజాయిని శాశ్వతంగా నిర్మూలిస్తాం
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:09 PM
పరివర్తన కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలతో జిల్లాలో ఇప్పటికే గంజాయి సాగు, రవాణాను అరికట్టామని, మరో ఏడాదిలో పూర్తిగా దానిని నిర్మూలిస్తామని ఎస్‌పీ అమిత్‌బర్ధార్ తెలిపారు.
మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాం
జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్
పాడేరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పరివర్తన కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలతో జిల్లాలో ఇప్పటికే గంజాయి సాగు, రవాణాను అరికట్టామని, మరో ఏడాదిలో పూర్తిగా దానిని నిర్మూలిస్తామని ఎస్‌పీ అమిత్‌బర్ధార్ తెలిపారు. ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయిని శాశ్వతంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ ఏడాది పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేశామని, గంజాయి వల్ల కలిగే నష్టాలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో చట్టవ్యతిరేకంగా సాగు, రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఫలితంగా గంజాయి సాగు, రవాణాను అరికట్టామని, మరో ఏడాదిలో జిల్లాలో గంజాయి వాసన లేకుండా చేస్తామని ఎస్‌పీ పేర్కొన్నారు.
మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాం
జిల్లాలో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించామని, కొత్తగా ఎవరూ మావోయిస్టుల్లో కలవలేదని ఎస్‌పీ అమిత్‌బర్ధార్ తెలిపారు. పోలీసులు చేపడుతున్న వివిధ రకాల ప్రత్యేక చర్యలతో గిరిజనులు మావోయిస్టులకు దూరమయ్యారన్నారు. అలాగే పలువురు మావోయిస్టులను అరెస్టు చేయడంతో పాటు మరికొందరు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయిందన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి నిర్మూలనకు అవసరమైన చర్యలు మరింత వేగవంతమయ్యాన్నారు. ఈ సమావేశంలో పాడేరు, చింతపల్లి డీఎస్‌పీలు కె.ప్రమోద్, ఎస్.అహ్మద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ అప్పలనాయుడు, డీసీఆర్‌బీ సీఐ సంజీవరావు పాల్గొన్నారు.