జలకళ అంతంత మాత్రమే..
ABN , Publish Date - May 26 , 2024 | 12:53 AM
జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఖరీఫ్‌కు ముందుగానే వర్షాలు విరివిగా కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నా అది నెరవేరలేదు. జలాశయాల్లోని నీటి నిల్వలు బయటకు పోకుండా గేట్లు మరమ్మతులు, పంట కాలువ పూడికతీత పనులు చేపట్టాల్సి వున్నా నిధుల కొరతతో జలవనరుల శాఖాధికారులు ఆయా పనుల జోలికి పోలేదు. దీంతో జిల్లాలో జలాశయాల దుస్థితి దారుణంగా తయారైంది.
- జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుముఖం
- ఖరీఫ్‌కు పొంచివున్న సాగునీటి కష్టాలు
- అన్నదాతల్లో ఆందోళన
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఖరీఫ్‌కు ముందుగానే వర్షాలు విరివిగా కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నా అది నెరవేరలేదు. జలాశయాల్లోని నీటి నిల్వలు బయటకు పోకుండా గేట్లు మరమ్మతులు, పంట కాలువ పూడికతీత పనులు చేపట్టాల్సి వున్నా నిధుల కొరతతో జలవనరుల శాఖాధికారులు ఆయా పనుల జోలికి పోలేదు. దీంతో జిల్లాలో జలాశయాల దుస్థితి దారుణంగా తయారైంది.
జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, వరహా, పెద్దేరు జలాశయాల కింద 84,763 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాలు విరివిగా కురిసి జలాశయాలు నిండితేనే రైతులకు సాగునీటి కష్టాలు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా తాండవ జలాశయ నీటి నిల్వలు రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. జల వనరుల శాఖాధికారులు అందించిన జలాశయాల్లోని నీటిమట్టాల వివరాలను పరిశీలిస్తే రానున్న ఖరీఫ్ సాగుకు జిల్లాలో సాగునీరు అందడం ప్రశ్నార్థకమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాండవ, రైవాడ జలాశయాల్లో గతేడాది ఇదే నెలలో నీటి నిల్వల కంటే ఈ ఏడాది తక్కువగా ఉన్నాయి. గతేడాది మే 22 నాటికి తాండవలో 370.10 అడుగులు నీటిమట్టం ఉండగా, ఈ ఏడాది 355.70 అడుగులకు పడిపోయింది. రైవాడలో గతేడాది 108.55 మీటర్ల నీరు వుంటే, ఈ ఏడాది 104.75 మీటర్ల నీరు ఉంది. కోనాం, వరహా జలాశయాల్లో నీటిమట్టాలు పెద్దగా తేడా కనిపించలేదు. పెద్దేరు జలాశయంలో గతేడాది కంటే రెండు మీటర్ల నీరు ఎక్కువగా పెరిగింది.
జిల్లాలో జలాశయాల వారీగా నీటి మట్టాల వివరాలు
-----------------------------------------------------------------
జలాశయం పూర్తి సామర్థ్యం ప్రస్తుతం గతేడాది
----------------------------------------------------------------
తాండవ 380.00 355.70 370.10 (అడుగులు)
రైవాడ 114.00 104.75 108.55 (మీటర్లు)
కోనాం 101.25 95.60 95.50 (మీటర్లు)
వరహా 460.00 453.40 453.30 (అడుగులు)
పెద్దేరు 137.00 135.65 133.40 (మీటర్లు)
-----------------------------------------------------------------