పీఎఫ్ కోసం ఎదురుచూపు
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:06 AM
ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో దాచుకున్న సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అడ్వాన్సుల కోసం వేలాది మంది దరఖాస్తు
వైసీపీ హయాం నుంచీ పెండింగ్
కూటమి ప్రభుత్వమైనా స్పందించాలని కోరుతున్న ఉద్యోగులు
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో దాచుకున్న సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ చాలా ప్రధానమైనది. సర్వీస్‌లో ఉండగా అవసరాలకు...పిల్లల చదువులు, వివాహాలు, ఇంటి కొనుగోలు, వైద్యం వంటి వాటికోసం పాక్షికంగా కొంత మొత్తం పీఎఫ్ ఖాతా నుంచి తీసుకునే వెసులుబాటు ఉంది. పంచాయతీరాజ్ ఉద్యోగులు అయితే జడ్పీ ద్వారా ఆడిట్‌కు పంపి తరువాత సీఎంఎఫ్‌ఎస్ ఖాతాకు అప్‌లోడ్ చేస్తారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఖజానా కార్యాలయం నుంచి సీఎంఎఫ్‌ఎస్ ఖాతాకు అప్‌లోడ్ చేస్తారు. సాధారణంగా దరఖాస్తు చేసిన రెండు లేదా మూడు నెలల్లో ఉద్యోగుల ఖాతాకు డబ్బులు జమ అవుతాయి. అయితే వైసీపీ హయాం నుంచి ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు అందిన దరఖాస్తుల్లో సగం వరకూ మాత్రమే క్లియర్ అయ్యాయి. మిగిలిన సగం మందితో పాటు మార్చి నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతవరకూ సొమ్ములు అందలేదు.
విశాఖ జిల్లాలో వందలాది మంది ఉద్యోగులు పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సుమారు రూ.65 కోట్ల వరకు రావలసి ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క జిల్లా పరిషత్ నుంచే 200 మంది ఉద్యోగులకు రూ.ఐదు కోట్ల వరకూ రావలసి ఉందని చెబుతున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్నవి, ఈ ఏడాది మార్చి నుంచి అందిన దరఖాస్తులకు సంబంధించి సుమారు రూ.65 కోట్ల వరకూ రావలసి ఉందని చెబుతున్నారు. గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ఇప్పటికీ పార్టు పేమెంట్ కూడా విడుదల కాలేదని ఉద్యోగాల సంఘాల ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తమ డబ్బులు తమకు ఇచ్చేందుకు అభ్యంతరమేమిటని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్జిత సెలవులకు సంబంధించి బకాయిలు విడుదల చేయడం రెండేళ్ల నుంచి ప్రభుత్వం మరిచిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ హయాంలో పట్టించుకోలేదని, కనీసం కూటమి ప్రభుత్వమైన పీఎఫ్ డబ్బులు చెల్లింపునకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.