వీఆర్‌ఎస్‌కే మొగ్గు!
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:26 AM
విశాఖ ఉక్కు ఉద్యోగులు సంస్థ ప్రస్తుత పరిస్థితిని చూసి అందులో కొనసాగడానికి ఆసక్తి చూపడం లేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైదొలగడమే మంచిదన్న ఆలోచనలో స్టీల్ ప్లాంటు ఉద్యోగులు
ఉత్పత్తి దారుణంగా పడిపోవడం, ముడి పదార్థాలు కొనుగోలుకు నిధులు లేకపోవడంతో ఆందోళన
కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని రెండు రోజుల క్రితం యాజమాన్యం ప్రకటన
ఇప్పటికే 1,700 మంది దరఖాస్తు
మూడేళ్ల సర్వీస్ ఉన్నవారంతా ఆమోదం
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉక్కు ఉద్యోగులు సంస్థ ప్రస్తుత పరిస్థితిని చూసి అందులో కొనసాగడానికి ఆసక్తి చూపడం లేదు. ఉత్పత్తి దారుణంగా పడిపోవడం, ముడి పదార్థాలకు నిధులు లేకపోవడం, కేంద్రం సాయం చేయడానికి ఆచితూచి వ్యవహరిస్తుండడం, అనేక నిబంధనలు అమలు చేస్తుండడం చూసి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్‌ఎస్ తీసుకుని బయటపడడమే మంచిదని భావిస్తున్నారు.
కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని, 45 ఏళ్ల వయస్సు కలిగిన వారు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని రెండు రోజుల క్రితం యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రాథమిక సర్వే మాత్రమేనని, దీనికి తెలియజేసే సమ్మతిని దరఖాస్తుగా భావించవద్దని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 29వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు 500 మంది, రెండో రోజు 1,200 మంది వీఆర్‌ఎస్‌కు సమ్మతి తెలియజేశారని తెలిసింది. పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల గడువు ఉన్నవారికి ఈ వీఆర్‌ఎస్ లాభదాయకంగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు లెక్కలు వేసి చెప్పడంతో...మూడేళ్ల సర్వీస్ ఉన్నవారంతా అందుకు మొగ్గు చూపుతూ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
ఇదీ ప్రణాళిక
విశాఖ ఉక్కు యాజమాన్యం వీఆర్‌ఎస్‌పై చాలాకాలంగా కసరత్తు చేస్తోంది. కేంద్రం కూడా ప్యాకేజీ ఇవ్వడానికి ముందే వీఆర్‌ఎస్‌కు ప్రత్యేకంగా రూ.1,260 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఉక్కు ఉద్యోగుల్లో 1,497 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 1,003 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లకు వీఆర్‌ఎస్‌కు ఇవ్వడానికి అంచనాలు తయారుచేసింది. ఎగ్జిక్యూటివ్‌లకు రూ.918.92 కోట్లు, నాన్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.340.19 కోట్లు అవసరం అవుతాయని లెక్కగట్టి మొత్తం రూ.1,260 కోట్లు బడ్జెట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికి వీఆర్‌ఎస్‌ను అమలు చేసి, 2,500 మందిని తగ్గించనున్నారు.
భారీగా పదవీ విరమణలు
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు. ఏ ఏటికి ఆ ఏడు పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. 2011 సంవత్సరంలో 147 మంది పదవీ విరమణ చేయగా, 2021కి వచ్చేసరికి వారి సంఖ్య 732కి చేరింది. 2022లో 960 మంది, 2023లో 1,005 మంది రిటైరయ్యారు. 2024లో మొత్తం 1,248 పదవీ విరమణ చేయనున్నారు. సాధారణంగా కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో నడిపించే ఉద్దేశం ఉంటే రిటైరవుతున్న వారి పోస్టులు భర్తీ చేస్తూ అవసరాలకు తగ్గట్టుగా కొత్తవారిని నియమించుకోవాలి. కానీ నాలుగేళ్లుగా నియామకాలు నిలిపివేశారు. ఇప్పుడు వీఆర్‌ఎస్ ఇస్తున్నారు. అంటే ఉద్యోగుల సంఖ్య తగ్గించాలనేది వారి వ్యూహంగా అర్థమవుతోంది.