Share News

ఓటర్లలో టాప్‌!

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:04 AM

భీమునిపట్నం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది.

ఓటర్లలో టాప్‌!

  • రాష్ట్రంలోనే ప్రథమం

  • జీవీఎంసీ 5, 6, 7 వార్డుల పరిధిలోనే లక్ష మంది ఓటర్లు

  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమ్మిళితం

  • పుణ్య క్షేత్రాలు, సందర్శనీయ స్థలాలకు ఆలవాలం

  • భీమిలి నియోజకవర్గం ప్రత్యేకం

  • భీమిలి నియోజకవర్గం డేటా

  • మొత్తం ఓటర్లు: 3,60,507

  • పురుషులు : 1,76,860

  • స్త్రీలు : 1,83,632

  • ఇతరులు : 15

  • 6,772 మంది మహిళా ఓటర్లు అధికం

  • 85 సంవత్సరాలు దాటిన వారు :1,808

  • దివ్యాంగ ఓటర్లు : 3,769

  • మొత్తం పోలింగ్‌ స్టేషన్లు : 348

  • వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్న పోలింగ్‌ స్టేషన్లు: 220

  • క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏరియాలు: 86

  • మండలాలవారీగా ఓటర్ల వివరాలు

  • పద్మనాభం : 42,033

  • ఆనందపురం: 51,224

  • భీమిలి : 1,01,892

  • విశాఖ రూరల్‌: 1,65,358

భీమునిపట్నం/ మధురవాడ, ఏప్రిల్‌ 23:

భీమునిపట్నం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 3,60,507 మంది ఓటర్లున్నారు. విస్తీర్ణంలోనూ పెద్దదిగా గుర్తింపు పొందింది. భీమిలి అర్బన్‌, మండలంతో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలు, ముఖ్యంగా మధురవాడ నియోజకవర్గంలో ఉండడంతో దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అంతేకాదు ప్రముఖ సందర్శనీయ స్థలాలు, విద్యా సంస్థలు, పుణ్యక్షేత్రాలు, స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, విశ్వవిద్యాలయాలు, బోధనాస్పత్రులకు నియోజకవర్గం ఆలవాలంగా నిలిచింది.

నియోజకవర్గం పరిధిలోని పద్మనాభం మండలం చిన్నాపురం, భీమిలి మండలం బోడమెట్టపాలెం, ఆనందపురం మండలం గండిగుండం వరకూ, అడవివరం, గోపాలపట్నం రైల్వేస్టేషన్‌ సమీపంలో వున్న ఎల్లపువానిపాలెం గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే వుండడం విశేషం. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం వెనుకబాగం, బీచ్‌రోడ్‌లో సాగర్‌నగర్‌, ఎండాడ, మదురవాడ, పీఎం పాలెం ఏరియాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా సింహాచలం పుణ్యక్షేత్రం, అనంతపద్మనాభస్వామి, గుడిలోవ రంగనాథస్వామి, భీమిలి శ్రీలక్ష్మీనృసింహస్వామి, రుషికొండ శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయలతో తదితర పుణ్యక్షేత్రాలు నియోజకవర్గంలోనే వున్నాయి. గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ, గాయత్రి, సంగివలస అనిల్‌ నీరుకొండ ఆస్పత్రులతో పాటు పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం, ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలు, గంభీరం ఐఐఎం దీని పరిధిలోనివే. రుషికొండ బ్లూఫ్లాగ్‌ బీచ్‌, సహజసిద్ధ ప్రకృతి సౌందర్యం భీమిలి బీచ్‌, మంగమారిపేట బీచ్‌, ఎర్రమట్టిదిబ్బలు, తొట్లకొండ, బావికొండ, పావురాయి కొండ ప్రాచీన బౌద్ధక్షేత్రాలు, అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పాండ్రంగి, అశోకుని విజయస్థూపం ప్రతిష్టించిన పొట్నూరు, ఐటీ సెజ్‌, స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, మంగమారిపేట చినజీయరుస్వామి వారిజ ఆశ్రమం, బ్యాంక్‌ కోలనీ శ్రీ కె.శివానందమూర్తి ఆశ్రమం, సద్గురు ఉమర్‌ ఆలీషా ఆశ్రమం, సౌరిస్‌ ఆశ్రమం ఇలా ఎన్నో నియోజకవర్గ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నాయి.

అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంగా గుర్తింపు పొందిన భీమిలి పరిధి జీవీఎంసీ 5,6,7 వార్డుల్లోనే సుమారు లక్షకు పైగా ఓటర్లున్నారు. అభ్యర్థుల విజయావకాశాలను నిర్దేశించేది వీరే. ఈ వార్డుల్లో ఉద్యోగులు, అక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. మిథిలాపురి వుడాకాలనీ, రత్నగిరి హౌసింగ్‌బోర్డు కాలనీ, రెవెన్యూకాలనీ, సంపత్‌నగర్‌, పోర్టుకాలనీ, హెచ్‌పీసీఎల్‌ లేఅవుట్‌, సాయిప్రియాగార్డెన్స్‌, అశోక్‌నగర్‌, తులసీనగర్‌ తదితర కాలనీల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీటితో పాటు స్వతంత్రనగర్‌ కాలనీ, బింద్రానగర్‌, ఆర్‌హెచ్‌కాలనీ, సేవానగర్‌, కె.వన్‌ కాలనీ, కె.2 కాలనీ, మారికివలస, దివ్యాంగుల కాలనీ ప్రాంతాల్లో రోజువారీ కూలీల సంఖ్య అధికం.

Updated Date - Apr 26 , 2024 | 01:04 AM