Share News

సమర్థులకే ఓటు

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:10 AM

‘‘పాలకులు ఎవరైనా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా ఉండాలి. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి బాట పట్టించాలి.

సమర్థులకే ఓటు

  • ఇదీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువత మనోగతం

  • ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే నాయకుడు కావాలి

  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకులనే ఎన్నుకుంటాం

  • ఉచిత పంపిణీలకు పరిమితమై అభివృద్ధిని పక్కనపెట్టడం సరికాదని వాదన

  • కుటుంబ సభ్యులో, బంధువులో చెప్పారని తమ నిర్ణయం మార్చుకోబోమని స్పష్టీకరణ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి)

‘‘పాలకులు ఎవరైనా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా ఉండాలి. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి బాట పట్టించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాలి. ఇవన్నీ చేయగల సమర్థత ఉన్న నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధితోపాటు ప్రజల జీవితాల్లోనూ మార్పు సాధ్యమవుతుంది. నా ఓటు అటువంటి సమర్థుడైన నాయకుడికే’’ అంటున్నాడు తొలిసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్న నగరానికి చెందిన పట్టభద్రుడు అచ్యుత్‌వర్మ. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎంతోమంది యువ ఓటర్లు ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధికి దిక్సూచిగా వ్యవహరించే నాయకుడిని ఎన్నుకుంటే మేలు జరుగుతుందన్న భావన యువ ఓటర్లలో ఉంది. ఉచిత పథకాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రజలు కష్టపడి సంపాదించుకునే మార్గాలను చూపించాలని, వృత్తి, ఉపాధి కల్పన మార్గాలపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. ఇప్పటికీ నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని, దీనిపై పాలకులు ఎందుకు దృష్టిసారించలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక, దానికి అనుగుణమైన కార్యాచరణ ముఖ్యమని, ఆ దిశగా పాలకులు ముందుచూపుతో వ్యవహరించాలని యువ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొలిసారి ఓటు వేయబోతున్న యువతీ, యువకుల మనోగతాన్ని తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ యత్నించింది. వారి అభిప్రాయాలు...

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి

నిజాయితీపరులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. అప్పుడే అభివృద్ధికి అవకాశం ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకెళ్లేలా పాలకుల ఆలోచన ఉండాలి. అప్పుడే మెరుగైన సమాజాన్ని స్థాపించేందుకు అవకాశం ఉంటుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలను మేనిఫెస్టోలో పెట్టాలి. యువతకు మేలు చేసే వారిని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. వైద్యం కూడా ఉచితంగా అందించాలి. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించే పాలకులను ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకుంటాను.

- ఎం.దేవి, డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థిని

ఉపాధి కల్పించే వారికే ఓటు

- కె.విష్ణుప్రియ, డిగ్రీ మూడో ఏడాది విద్యార్థి

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయి. కానీ, నిరుద్యోగుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. చదివిన చదువులకు ఉద్యోగాలు దొరకనప్పుడు..ఈ విద్యా వ్యవస్థ, ప్రభుత్వాలు ఎందుకు. పాలకులకు ముందుచూపు లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలకులు ఎవరైనా ఉద్యోగాలు కల్పించేలా ఉండాలి. కొత్త పరిశ్రమలను తీసుకురావాలి. యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలి. అటువంటి ఆలోచన చేసే ప్రభుత్వాలకే ఓటు వేస్తాం. ఇప్పటికే ఆ దిశగా నిర్ణయం తీసుకున్నాం. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రతి ఒక్కరిదీ ఇదే మాట.

ప్రజలకు అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలి

- కె.మినీషా, డిగ్రీ మూడో ఏడాది విద్యార్థి

స్థానిక సమస్యలపై అవగాహన కలిగిన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తరువాత ఎంతోమంది ప్రజలకు అందుబాటులో ఉండరు. వారి సమస్యలను పట్టించుకోరు. అటువంటి నేతలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉపాధి పొందే మార్గాలను చూపించాలి. సంపాదన అవకాశాలను చూపించాలి. అప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. మేనిఫెస్టోల్లో అనేక అంశాలను పేర్కొని..వాటిని అమలు చేయడానికి ఇబ్బందులు పడడం మంచిది కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల స్థితిగతులను మెరుగుపర్చే కీలక అంశాలపై దృష్టిసారించేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ప్రజలు స్వీయాభివృద్ధి సాధించడంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది.

అప్పులు చేసి పంపకాలు చేయడం సరికాదు

- ఎం.చంద్రలోకేష్‌, డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థి

ఏ ప్రభుత్వం వచ్చినా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అభివృద్ధితో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వాలు ప్రాధాన్యం కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమలు ఎక్కువ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అప్పుడే రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఉచితాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇబ్బంది కలుగుతోంది. ఇటువంటి వాటికి చెక్‌ చెప్పాలి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఆలోచించాలి. అప్పులు చేసి పంపకాలు చేయడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోతుంది. పట్టణాలు, నగరాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

అవినీతి రహిత పాలన అందించేవారికే ఓటు

- ఎం.జోగి శివరామ్‌, డిగ్రీ ఫైలినయర్‌ విద్యార్థి

అవినీతి రహిత పాలన అందించే పాలకులను ఎన్నుకోవాలి. ఇప్పటికీ అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తేనేగానీ పనులు జరగడం లేదు. ఇటువంటి వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు కృషిచేయడం లేదు. అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అటువంటి మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు తొలి ఓటును వినియోగించుకుంటాను. బంధువులు చెప్పారనో, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారనో బలవంతంగా ఎవరికీ ఓటు వేయకూడదు. నా మనసుకు నచ్చిన వ్యక్తికి ఓటేసి గెలిపిస్తాను.

ఉచితాలకు కాదు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి

- పి.దుర్గ శివమ్‌, డిగ్రీ సెకండియర్‌ విద్యార్థి

నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. పీజీ ప్రైవేటు కళాశాలల్లో చేయడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ ఇవ్వడం లేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే ప్రభుత్వానికి ఓటేస్తాను. నిరుపేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఉచితాలకు కాకుండా అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేయాలి. అప్పులు చేసి పథకాలు అమలుచేసే విధానానికి పాలకులు దూరంగా ఉండాలి. అటువంటి నేతకు మాత్రమే ఓటు వేస్తాను.

తాయిలాలకు లొంగకూడదు

తాత్కాలిక తాయిలాల కంటే శాశ్వత అభివృద్ధి పథకాలు అమలు చేయగలిగిన సత్తా ఉన్న అభ్యర్థులను ఎన్నుకుంటేనే సమాజానికి మేలు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన ్న వారికి ఓటు వేయాలి. కార్మిక, కర్షకుల ప్రగతికి సమ ప్రాధాన్యం ఇచ్చే నేతలు అవసరం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు వెనుకబడితే ఆర్థిక వ్యవస్థలు పతనమవుతాయి.

- తారకరామ్‌, వ్యవసాయదారుడు, నర్సీపట్నం

ఉపాధికి భరోసా ఇవ్వాలి

నిరుద్యోగ యువతకు ఉపాధికల్పనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలను, నేతలను ఎన్నుకోవాలి. మోసపూరిత మాటలు, ఉచితం పేరుతో తాయిలాలు మేలు చేయవు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చే వారు కావాలి. చట్టసభల్లో సమస్యలు ప్రస్తావించి, పరిష్కరించే సామర్థ్యం ఉన్న వారికి ఓటు వేయాలి. విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటామన్న పార్టీని గెలిపించుకోవడం మంచిది.

- అంగనైని ఆనంద్‌, విద్య్దార్థి, అరకు

లౌకికతత్వం అవసరం

ప్రజాస్వామ్యం పటిష్టంగా కొనసాగాలంటే లౌకిక తత్వ రాజకీయ పార్టీలనే గెలిపించుకోవాలి. కులమతాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే పార్టీలతో ప్రమాదం. అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూసే పార్టీలతో మేలు జరగక పోయినా కీడు జరగదు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం పదాలు రాజకీయ నేతలు వల్లించడానికి బాగుంటున్నాయి. వాటికి కట్టుబడిన వ్యక్తులు, పార్టీలు తక్కువ. అలాంటి వ్యక్తులను చట్టసభలకు పంపితే అభివృద్ధికి అవకాశం.

- కేఎన్‌ మల్లీశ్వరి, నవలా రచయిత్రి, విశాఖ

గిరిజన హక్కులకు రక్షణ కల్పించే వారికే...

సంతారి గోపాలరాజు, లోచలిపుట్టు గ్రామం,

హుకుంపేట మండలం, అల్లూరి జిల్లా

గిరిజన ప్రాంత ప్రజల హక్కులు, చట్టాల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చే నేతలకే ఓటు వేయాలని భావిస్తున్నాను. నాకు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించే అవకాశం వచ్చింది. దానిని సక్రమంగా వినియోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రధానంగా గిరిజన ప్రాంత అభివృద్ధి, సంక్షేమంతోపాటు గిరిజనుల హక్కులు, చట్టాలకు రక్షణ కల్పించే నేతకే ఓటు వేస్తాను. యువత, విద్యా వంతులు సైతం కాస్తా ఆలోచించి గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే వారికే ఓటు వేస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నాను.

అభివృద్ధి ప్రదాతకే...

రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి సాదించే వ్యక్తికే ఓటు వేస్తా. వ్యవసాయ పరంగా, విద్యాపరంగా, పారిశ్రామికపరంగా, ఐటీ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచే వారిని ఎన్నుకోవాలి. భవిష్యత్తులో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవారికే ఓటు వేస్తా.

-జి.అంజిని, దాడి వీరునాయుడు కళాశాల, అనకాపల్లి

ఉద్యోగావకాశాలు కల్పించగలిన వారికే...

ద్రాక్షారపు గౌతమ్‌, డిగ్రీ విద్యార్థి, బలిఘట్టం

ఎన్నికలలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకున్న యువతను నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులకు ముందుచూపు లేకపోవడం వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. త్వరలో జరగబోయే ఎన్నికలలో నా మొదటి ఓటు ఆలోచించి వేస్తాను.

Updated Date - Apr 26 , 2024 | 01:11 AM