Share News

వలంటీర్ల చందాల దందా

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:49 PM

గ్రామ దేవత జాతర పేరిట పింఛన్‌దారుల నుంచి వలంటీర్లు బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారు. ఈ నెల ఇచ్చిన సామాజిక పింఛన్‌లో లబ్ధిదారుల నుంచి సగం నగదు తీసుకున్నారు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం వీరంతా ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేశారు.

వలంటీర్ల చందాల దందా
తహసీల్దార్‌ రవిచంద్రకు వినతిపత్రం ఇస్తున్న పింఛన్‌దారులు

గ్రామ దేవత జాతర పేరిట బలవంతంగా వసూళ్లు

వైసీపీ నేతల ఆదేశంతో పింఛన్‌ నగదులో సగం వరకు కోత

లబ్ధిదారుల గగ్గోలు

ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు

రోలుగుంట, మార్చి 4 : గ్రామ దేవత జాతర పేరిట పింఛన్‌దారుల నుంచి వలంటీర్లు బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారు. ఈ నెల ఇచ్చిన సామాజిక పింఛన్‌లో లబ్ధిదారుల నుంచి సగం నగదు తీసుకున్నారు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం వీరంతా ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేశారు.

మండలంలోని కుసర్లపూడిలో ఈ నెల 1వ తేదీ నుంచి వలంటీర్లు సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ గ్రామంలో అన్ని రకాల పింఛన్లు కలిపి 350 వరకు ఉన్నాయి. కాగా ఈ నెల 24న గ్రామ దేవత జాతర మహోత్సవం సందర్భంగా చందాలు వసూలు చేసే పనిని స్థానిక వైసీపీ నాయకులు గ్రామ వలంటీర్లకు అప్పగించారు. దీంతో 14 మంది గ్రామ వలంటీర్లు తమ క్లస్టర్‌ పరిధిలోని పింఛన్‌దారుల నుంచి చందాలు వసూలు చేశారు. పింఛన్‌ పంపిణీ కోసం లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకుని ఒక్కొక్కరి నుంచి రూ.1500 వసూలు చేశారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా మంజూరైన పింఛన్‌దారుల నుంచి మొత్తం నగదు తీసుకున్నారు. మరికొంత మంది వలంటీర్లు అయితే వేలిముద్రలు వేయించుకుని డబ్బులు తరువాత ఇస్తామని చెప్పి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామం నుంచి అధిక సంఖ్యలో ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసి పింఛన్‌ సొమ్ము ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

వలంటీరు రూ.1500 తీసుకున్నాడు

ఎప్పటిలాగానే గ్రామ వలంటీరు వచ్చి పింఛన్‌ ఇస్తానని చెప్పి వేలిముద్ర వేయించుకున్నాడు. ఆ తరువాత రూ.1500 చేతిలో పెట్టాడు. ఏమని అడిగితే చందాలు వసూలు చేస్తున్నాం, ఈ నెల సగం పింఛన్‌ డబ్బులే ఇస్తున్నామని చెప్పాడు. నాకు పింఛన్‌ డబ్బులే ఆధారం. ఈ నెల కోత విధించడంతో ఈ నెల ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు. కొత్తగా పింఛన్లు మంజూరు అయిన వారి నుంచి రూ.3000 చొప్పున తీసుకున్నారు. ఇది చాలా ఘోరం.

- మఠం నరసయ్య, పింఛన్‌దారుడు, కుసర్లపూడి

Updated Date - Mar 04 , 2024 | 11:49 PM