Share News

సంక్షోభంలో విశాఖ ఉక్కు

ABN , Publish Date - May 16 , 2024 | 01:23 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. అదానీ గంగవరం పోర్టులో ఏప్రిల్‌ 12న నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె నెల రోజులకు పైగా కొనసాగుతోంది. దీని ఫలితంగా స్టీల్‌ ప్లాంటుకు పోర్టు నుంచి బొగ్గు, లైమ్‌స్టోన్‌ సరఫరా నిలిచిపోయింది.

సంక్షోభంలో విశాఖ ఉక్కు

భారీగా పడిపోయిన ఉత్పత్తి

నెల రోజులు దాటినా అందని బొగ్గు

అదానీ పోర్టులో చిక్కుకుపోయిన రూ.600 కోట్ల నిల్వలు

ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి

మార్చి విద్యుత్‌ బకాయిలు రూ.68.43 కోట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. అదానీ గంగవరం పోర్టులో ఏప్రిల్‌ 12న నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె నెల రోజులకు పైగా కొనసాగుతోంది. దీని ఫలితంగా స్టీల్‌ ప్లాంటుకు పోర్టు నుంచి బొగ్గు, లైమ్‌స్టోన్‌ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడెక్కడి నుంచో రూ.600 కోట్ల అప్పులు తెచ్చి ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుంచి స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం కోకింగ్‌ కోల్‌ తెప్పించుకుంటే అది పోర్టులో చిక్కుకు పోయింది. స్టీల్‌ప్లాంటుకు నష్టం జరగకుండా బొగ్గు పంపాలనుకుంటే అదానీకి నిమిషాలపై పని. కానీ కార్మికుల సమ్మెను సాకుగా చూపించి ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం వల్ల చర్చలు కూడా సవ్యంగా నిర్వహించడం లేదు. స్టీల్‌ అధికారుల సంఘం హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చినా వాటినీ పట్టించుకోవడం లేదు. సమస్యను దీర్ఘకాలంపాటు సాగదీసి విశాఖ స్టీల్‌ప్లాంటును నష్టాల్లో ముంచేయడానికి అన్ని శక్తులూ తెర వెనుక నుంచి పనిచేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ సమక్షంలో చర్చలు నిర్వహించాలని కార్మికులు కోరుతుంటే...దానికి పోర్టు యాజమాన్యం చొరవ చూపడం లేదు. ఎన్నికల విధుల్లో ఉన్నందున కలెక్టర్‌, కమిషనర్‌ ఈ సమస్యను పట్టించుకోలేదంటే కొంతవరకు ఉక్కు కార్మిక సంఘాలు విశ్వసించాయి. ఇప్పుడు అన్ని రకాల పని ఒత్తిళ్లు తగ్గిపోయినా జిల్లా అధికారులు ప్లాంటు సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భారీగా పడిపోయిన ఉత్పత్తి

స్టీల్‌ప్లాంటులో నెలకు రూ.2,500 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయి. రోజుకు సగటున 20 వేల టన్నుల స్టీల్‌ తయారుచేస్తారు. బొగ్గు, ఇతర ముడిపదార్థాలు అందుబాటులో లేకపోవడం వల్ల గత ఏప్రిల్‌ నెలలో రూ.1,250 కోట్ల విలువైన స్టీల్‌నే తయారుచేశారు. వివిధ వర్గాల నుంచి రూ.800 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకోవడంతో వారంతా 70 శాతానికి పైగా ఉత్పత్తులు తీసుకుపోయారు. స్టీల్‌ నిల్వలు కూడా పడిపోయాయి. మే నెలకు వచ్చేసరికి ఉత్పత్తి మరీ తగ్గిపోయింది. ఈ నెల 14వ తేదీ నాటికి 70 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. వాస్తవానికి వేయి కోట్ల రూపాయలకుపైగా విలువైన ఉత్పత్తులు తయారు చేయాల్సి ఉండగా కేవలం రూ.370 కోట్ల విలువైన ఉత్పత్తులే తయారయ్యాయి. అదానీ పోర్టు కారణంగా స్టీల్‌ప్లాంటుకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి బాధ్యత వహిస్తూ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా...అది తనకు వర్తించదంటూ ‘మెజ్యూర్‌’ నోటీసు జారీచేసింది. ప్రకృతి కారణంగా జరిగే నష్టాలకు వర్తించే ‘మెజ్యూర్‌’ను ఈ సమ్మెకు ఆపాదిస్తూ తాము నష్ట పరిహారం ఇవ్వబోమని అదానీ పోర్టు మొండికేసింది.

జీతాలు లేవు...విద్యుత్‌ బిల్లులు లేవు

సరైన ఉత్పత్తి, అమ్మకాలు లేకపోవడంతో ఏప్రిల్‌ నెల జీతాలు ఇప్పటివరకు స్టీల్‌ప్లాంటు ఇవ్వలేకపోయింది. ఉద్యోగులు, కార్మికులు అందరికీ కలిపి నెలకు రూ.84 కోట్ల వరకు జీతాలుగా ఇవ్వాల్సి ఉంది. గత నెలలో కూడా చేతిలో నగదు నిల్వలు లేకపోవడంతో రెండు వాయిదాల్లో జీతాలు చెల్లించింది. ఈ నెల 15వ తేదీ వచ్చినా రూపాయి కూడా ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే విద్యుత్‌ బిల్లుల భారం పెరిగిపోయింది. మార్చి నెలకు సంబంధించిన బిల్లు, డిమాండ్‌ చార్జీలు కలిపి రూ.68.43 కోట్లు బకాయి ఉందని, రెండు రోజుల్లో చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ నోటీసు జారీ చేసింది. తక్షణమే కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ కల్పించుకొని కార్మికులతో చర్చలు ఏర్పాటు చేసి, స్టీల్‌ప్లాంటుకు బొగ్గు, లైమ్‌స్టోన్‌ అందించే దిశగా చర్యలు చేపట్టాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - May 16 , 2024 | 08:07 AM