Share News

సైబర్‌క్రైమ్‌కు హాట్‌స్పాట్‌గా విశాఖ

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:46 AM

నగరంలో సైబర్‌ నేరాలు ఇదేమాదిరిగా నమోదైతే భవిష్యత్తులో సైబర్‌ క్రైమ్‌కు హాట్‌స్పాట్‌గా మారే ప్రమాదం ఉందని పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. గత మూడేళ్లలో నగరంలో 12 వేల మందికిపైగా సైబర్‌ మోసాలకు గురయ్యారన్నారు. వీరంతా రూ.85 కోట్లు వరకూ పోగొట్టుకున్నారని, అందులో కేవలం రూ.18 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగామన్నారు. సైబర్‌క్రైమ్‌ బారినపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు సైబర్‌ మోసాలు జరిగే తీరుతెన్నులపైనా, మోసానికి గురైతే తక్షణం చేయాల్సిన పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

సైబర్‌క్రైమ్‌కు హాట్‌స్పాట్‌గా విశాఖ
సైబర్‌క్రైమ్‌పై అవగాహనకు రూపొందించిన హ్యాండ్‌బుక్‌ని ఆవిష్కరిస్తున్న సీపీ రవిశంకర్‌అయ్యన్నార్‌

మూడేళ్లలో 12 వేలకుపైగా బాధితులు

పోగొట్టుకున్న సొమ్ము రూ.85 కోట్లు

అవగాహనతోనే నేరాలకు అడ్డుకట్ట

సీపీ రవిశంకర్‌అయ్యన్నార్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):

నగరంలో సైబర్‌ నేరాలు ఇదేమాదిరిగా నమోదైతే భవిష్యత్తులో సైబర్‌ క్రైమ్‌కు హాట్‌స్పాట్‌గా మారే ప్రమాదం ఉందని పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. గత మూడేళ్లలో నగరంలో 12 వేల మందికిపైగా సైబర్‌ మోసాలకు గురయ్యారన్నారు. వీరంతా రూ.85 కోట్లు వరకూ పోగొట్టుకున్నారని, అందులో కేవలం రూ.18 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగామన్నారు. సైబర్‌క్రైమ్‌ బారినపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు సైబర్‌ మోసాలు జరిగే తీరుతెన్నులపైనా, మోసానికి గురైతే తక్షణం చేయాల్సిన పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందన్నారు. సైబర్‌ మోసాలు జరిగే విధానం, మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన నాలుగు వీడియోలతోపాటు హ్యాండ్‌బుక్‌, వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. హ్యాండ్‌బుక్‌ను కాలేజీలు, పాఠశాలలు, యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంచి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రస్తుతం కొరియర్‌ సర్వీసు, గేమ్‌ టాస్క్‌, ట్రేడింగ్‌, లోన్‌ యాప్‌ల పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కి ఫోన్‌చేయాలన్నారు. దీనివల్ల తక్షణం స్పందించి బ్యాంకు నుంచి నగదు ఏఏ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్‌ అయిందో గుర్తించి ఫ్రీజ్‌ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో 2023, 2024లో ఇప్పటివరకూ 12 మంది మోసానికి గురై రూ.1.08 కోట్లు పోగొట్టుకున్నారన్నారు. గేమ్‌టాస్క్‌ పేరుతో 2022, 2023, 2024లో ఇంతవరకూ 213 మంది మోసానికి గురై రూ.18.42 కోట్లు నష్టపోయారన్నారు. లోన్‌యాప్‌ పేరుతో జరిగే మోసాల్లో 2022, 2023 సంవత్సరాల్లో 21 మంది రూ.77 లక్షలు నష్టపోయారన్నారు. నకిలీ బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు సరఫరా చేస్తున్న పది మందిని అరెస్టు చేశామన్నారు. గత నాలుగేళ్లలో జరిగిన సైబర్‌ నేరాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ, సైబర్‌క్రైమ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలు ప్రకారం నిందితులుగా ఉన్న నగరానికి చెందిన 126 మందిని గుర్తించామని, వారిలో 36 మందిని అదుపులోకి తీసుకుని వారి పాత్రపై విచారణ చేస్తున్నామన్నారు. సైబర్‌క్రైమ్‌కు పాల్పడుతున్న వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు, నకిలీ ధ్రువపత్రాలతో సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటుండడం వల్ల వారిని గుర్తించడం క్లిష్టతరంగా మారుతోందన్నారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్‌ సీఐలు కె.భవానీప్రసాద్‌, లక్ష్మణరావు, ఎస్‌ఐ హరికిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 01:47 AM