Share News

విశాఖ తూర్పు...విశిష్టం!

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:45 AM

ఒకనాటి బెస్తవారి పల్లె నేడు మహానగరంగా విస్తరించింది.

విశాఖ తూర్పు...విశిష్టం!

మేధావులు, విద్యావంతులకు నిలయం

మూడు దపాలుగా టీడీపీకి తగ్గని ఆదరణ

ఎంవీపీ కాలనీ :

ఒకనాటి బెస్తవారి పల్లె నేడు మహానగరంగా విస్తరించింది. పలు రంగాల్లో ప్రగతి పయనాన్ని కొనసాగిస్తోంది. విద్య, వైద్యం, పర్యాటక, పారిశ్రామిక రంగాలతో పాటు జనాభా రీత్యా, రాజకీయంగా పలు మార్పులకు విశాఖ ప్రభావితమయింది. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల నాటికే విశాఖపట్నం నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఆ ఎన్నికల్లో కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ తరఫున పోటీచేసిన తెన్నేటి విశ్వనాథం గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. 1952 అక్టోబరులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు కేబినెట్‌లో తెన్నేటి విశ్వనాథం ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1953లో విశాఖ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున తిరిగి తెన్నేటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మధ్యంతర ఎన్నికల్లో ఏవీబీ రావు, కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఎన్నికయ్యారు. 1962లోనూ ఇదే పార్టీ నుంచి ఆయన మళ్లీ గెలుపొందారు.

1967 ఎన్నికల నుంచి విశాఖ రెండు శాసనసభ నియోజకవర్గాలుగా ఏర్పడింది. 2004 ఎన్నికల వరకూ విశాఖ 1, విశాఖ 2 ఉండగా, దేశవ్యాప్తంగా జరిగిన డీలిమిటేషన్‌ కారణంగా 2009 సాధారణ ఎన్నికల నాటికి విశాఖ నగరం ఐదు శాసనసభ నియోజకవర్గాలుగా రూపాంతరం చెందింది. విశాఖ 1, 2లను రద్దు చేసి వాటి స్థానంలో విశాఖ దక్షిణ, తూర్పు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి.

విశాఖ తూర్పు స్థానానికి జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసిన వెలగపూడి రామకృష్ణబాబు 44,233 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,02,447 మంది కాగా, 1,38,104 ఓట్లు పోలయ్యాయి. వెలగపూడి రామకృష్ణబాబు తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం అభ్యర్థి చెన్నుబోయిన శ్రీనివాస్‌పై 4,031 ఓట్లు ఆధిక్యత సాధించారు. రెండోసారి 2014లో జరిగిన ఎన్నికల్లో వెలగపూడికి 1,00,624 ఓట్లు లభించాయి. సమీప వైసీపీ అభ్యర్థి చెన్నుబోయిన శ్రీనివాస్‌పై 47,883 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మూడోసారి తూర్పులో జరిగిన 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి విచినా, విశాఖ తూర్పులో మాత్రం తెలుగుదేశం హ్యాట్రిక్‌ విజయం సాధించి, వెలగపూడి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23 సీట్లు రాగా అందులో తూర్పు ఒకటి కావడం విశేషం. ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతటి వైసీపీ గాలిలోనూ 76,504 ఓట్లు సాధించి, సమీప అభ్యర్థి అక్కరమాని విజయనిర్మలపై 23,635 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక ఈ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానానికి పరిమితం కాగా, 2014, 2019లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. రాష్ట్ర విభజన ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపించింది. 2014లో తెలుగుదేశంతో జత కట్టిన భారతీయ జనతా పార్టీ 2009, 2019లో డిపాజిట్లు కోల్పోవడం పెద్దగా వింతేమీ కాలేదు.

విశాఖ తూర్పులో మేధావులు, విద్యావంతులు అధికంగా ఉన్నారు. అన్ని వసతులు, సౌకర్యాలతో ఎంవీపీ కాలనీ 12 సెక్టార్లలో విస్తరించింది. విశాలాక్షినగర్‌, లాసన్స్‌బే కాలనీ, సిరిపురం తదితర ప్రాంతాల్లో విద్యావంతులు, ఉద్యోగులు అధికం. ఆరిలోవ ఐదు సెక్టార్లలో విస్తరించి ఉండగా ఈ ప్రాంతంలో మధ్య, దిగువ, కిందిస్థాయి కుటుంబాలు ఉంటున్నాయి. ఆంధ్రాయూనివర్సిటీ, గీతం యూనివర్సిటీల్లో పనిచేసేవారు ఎక్కువగా తూర్పులోనే నివసిస్తున్నారు. హనుమంతువాక నుంచి ధారపాలెం వరకూ కొండవాలు ప్రాంతాలు, హెల్త్‌సిటీ ఉన్నాయి. విశాఖ వ్యాలీ, సత్యసాయి వంటి ప్రముఖ పాఠశాలలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన ప్రజలు, భవన నిర్మాణ కార్మికుల్లో అత్యధిక శాతం మంది ఇక్కడే జీవిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో వీరి పాత్ర చాలా కీలకమైనది.

వెలగపూడి హ్యాట్రిక్‌

నియోజకవర్గం ఆవిర్భావం తర్వాత మూడుసార్లు వరుసగా ఎన్నిక

ఎంవీపీ కాలనీ, ఏప్రిల్‌ 18:

తూర్పు నియోజకవర్గం... 2008లో ఆవిర్భవించింది. అంతకు ముందు పెందుర్తి నియోజకవర్గంలో భాగమై ఉన్న కొంత ప్రాంతం, విశాఖ రెండో నియోజకవర్గంలోని కొంత ప్రాంతాన్ని తూర్పు నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. ఇక్కడ 2,72,215 మంది ఓటర్లున్నారు. ఆవిర్భావం నుంచి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు విజేతగా వెలగపూడి రామకృష్ణబాబు నిలిచారు.

తూర్పు నియోజకవర్గం పేరిట 2009లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, ప్రజారాజ్యం నుంచి చెన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ శ్రీనివాస్‌), కాంగ్రెస్‌ తరఫున ఉరుకూటి అప్పారావు, లోక్‌సత్తా నుంచి జాన్సీ లక్ష్మి, భారతీయ జనతా పార్టీ నుంచి కె.రాజకుమారి పోటీ చేశారు. ఇందులో వెలగపూడి రామకృష్ణబాబు తన సమీప ప్రత్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్‌పై 4 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఉరుకూటి అప్పారావుకు 38,098 ఓట్లు రావడం విశేషం. లోక్‌సత్తా అభ్యర్థిని ఝాన్సీలక్ష్మీకి కూడా పదివేల ఓట్లు రావడం గమనార్హం. బీజేపీకి కేవలం 2,218 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గం ఏర్పాటుతోనే వెలగపూడి విజేతగా బోణీ కొట్టారు.

ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున వెలగపూడి రెండో సారి పోటీ పడగా, ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి వచ్చిన వంశీకృష్ణ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో వెలగపూడి 1.62 లక్షల ఓట్లు సాధించగా వంశీకృష్ణ కు 52,741 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వెలగపూడికి 47,883 ఓట్ల రికార్డు మెజారిటీ లభించింది. ఇక 2019లో మూడోసారి జరిగిన ఎన్నికల్లో వెలగపూడి బరిలో ఉండగా, వైసీపీ అక్కరమాని విజయనిర్మలను రంగంలోకి దించింది. జనసేన పార్టీ కోన తాతారావును అభ్యర్థిగా నిలిపింది. ఈ సారి వెలగపూడి అక్కరమాని విజయనిర్మలపై 26,474 ఓట్ల మెజారిటీతో గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. కోన తాతారావుకు 17,873 ఓట్లు రాగా, విజయనిర్మలకు 60,599 ఓట్లు వచ్చాయి.

నాలుగోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీలో దిగి, మరోసారి సత్తా చాటాలని వెలగపూడి ప్రయత్నిస్తుండగా, వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఈ సారి విశేషం.

Updated Date - Apr 19 , 2024 | 01:45 AM