Share News

నిబంధనలకు పాతర! అక్రమాల జాతర!!

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:01 AM

కప్పరాడలో మూడు ఎకరాల విస్తీర్ణంలో మెగా షాపింగ్‌ మాల్‌ నిర్వహిస్తున్న అలక్రమ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ నిబంధనలు ఏమీ పాటించడం లేదు.

నిబంధనలకు పాతర! అక్రమాల జాతర!!
Construction Building

  • ఏఎస్‌ఎన్‌ మెగా షాపింగ్‌ మాల్‌ నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలు

  • భూమి వినియోగ మార్పిడికి అనుమతి తీసుకోకుండానే పనులు

  • గడువు మీరినా పూర్తికాని నిర్మాణం...రెన్యువల్‌కు ముందుకురాని వైనం

  • టాయిలెట్‌ నిర్మాణం కోసం ఏపీఐఐసీ భూమి ఆక్రమణ

  • నోటీసులు ఇచ్చినా స్పందన శూన్యం

  • నెత్తీ నోరు కొట్టుకుంటున్న ఏపీఐఐసీ

  • చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కప్పరాడలో మూడు ఎకరాల విస్తీర్ణంలో మెగా షాపింగ్‌ మాల్‌ నిర్వహిస్తున్న అలక్రమ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ నిబంధనలు ఏమీ పాటించడం లేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. వీటిని గుర్తించి ఏపీఐఐసీ ఐలా నోటీసులు ఇస్తుంటే కనీస స్పందన లేదు. భవన నిర్మాణం పూర్తిచేయడానికి ఇచ్చిన మూడేళ్ల గడువు పూర్తయినా దానిని రెన్యువల్‌ చేసుకోవడం లేదు.

పాస్‌పోర్టు సేవా కేంద్రం ఎదురుగా మూడేళ్లుగా ఏఎస్‌ఎన్‌ మెగా షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందున్న గ్రీన్‌ బెల్ట్‌ను నాశనం చేసి కలిపేసుకున్న సంగతి తెలిసిందే. ఆ భూమి విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉన్నా జీవీఎంసీ దానిని నోరెత్తడం లేదు. ఇప్పుడు మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అడ్డగోలు వ్యవహారాలను ప్రశ్నిస్తూ, నిర్మాణాలు ఆపాలని ఎప్పటికప్పుడు ఏపీఐఐసీ ఐలా కమిషనర్‌ కార్యాలయం నోటీసులు జారీచేస్తోంది. గత మూడేళ్లలో దాదాపు యాభైకి పైగా నోటీసులు ఇచ్చింది. వాటిలో దేనికీ అలక్రమ్‌ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వలేదు. నిర్మాణాలు ఆపలేదు. ఆక్రమణలు తొలగించలేదు. ఇంత పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతుంటే..జీవీఎంసీ గానీ, జిల్లా కలెక్టర్‌ గానీ దీనిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

ఇవిగో ఉల్లంఘనలు..

- ఈ భూమి కప్పరాడ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఉంది. పరిశ్రమల కోసం భూమి కేటాయించారు. దానిని అలక్రమ్‌ యాజమాన్యం కొనుగోలు చేసి, మాల్‌ నిర్మాణం ప్రారంభించింది. అందుకు భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేయాలి. తగిన ఫీజులు చెల్లించాలి. కానీ ఇంతవరకూ ఆ పని చేయలేదు. పరిశ్రమలకు ఇచ్చిన స్థలంలో వాణిజ్య భవనం నిర్మిస్తున్నారు. దీనిపై ఐలా కమిషనర్‌ అనేకమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. 2024 మే 15న కూడా మరో నోటీసు ఇచ్చారు.

- ఈ మాల్‌ నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే 2021 మార్చి 20న అనుమతి ఇచ్చారు. మూడేళ్లలో పూర్తిచేయాలని గడువు విధించారు. 2024 మార్చి 19 నాటికి పూర్తికావాలి. కానీ ఇంకా సగం కూడా నిర్మించలేదు. దీంతో ఐలా కమిషనర్‌ భవన నిర్మాణ ప్లాన్‌ రెన్యువల్‌ చేసుకోవాలని అనేకసార్లు నోటీసులు ఇచ్చారు. కానీ రెన్యువల్‌ చేసుకోకుండానే నిర్మాణం కొనసాగిస్తున్నారు. పనులు ఆపాల్సిందిగా చెప్పినా పట్టించుకోవడం లేదు. పైగా కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం తనకు అదనపు సమయం 12 నెలలు ఇవ్వాలని కోరారు. అయితే ‘కొవిడ్‌ మినహాయింపు’ గడువు ముగిసిన తరువాత ఈ నిర్మాణానికి దరఖాస్తు చేశారని, ఆ నిబంధన వర్తించదని ఐలా చెప్పినా చెవికి ఎక్కించుకోవడం లేదు.

- ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో డి 33, డి 33 బి, 34, 35 ప్లాట్లకు ఆనుకొని ఉన్న ఏపీఐఐసీ భూమిని ఏఎస్‌ఎన్‌ మెగా షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం ఆక్రమించుకుని తమ వద్ద పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కోసం టాయిలెట్లు నిర్మించింది. వాటికి సెప్టిక్‌ ట్యాంక్‌ గానీ, స్టోరేజీ ట్యాంకు గాని నిర్మించలేదు. పైపులు పెట్టి నేరుగా మురుగు కాలువలోకి వదిలేస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల స్థానిక ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఐలా కమిషనర్‌ చెప్పినా వినడం లేదు.

- మాల్‌కు దక్షిణం వైపు సెట్‌ బ్యాక్‌లు వదలకుండా నిర్మాణాలు చేపట్టారు.

- ఇది ఏపీఐఐసీ లేఅవుట్‌. అందులో రోడ్డు నంబరు 12ను రెండు మీటర్ల మేర ఆక్రమించి కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారు. దానిని తొలగించాలని 2024 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు అనేకమార్లు నోటీసులు ఇస్తూనే ఉన్నా స్పందించలేదు.

- ఒక పైపులైన్‌ వేసి దానిని మురుగు కాలువకు కనెక్ట్‌ చేయడానికి పక్కనే ఉన్న రహదారిని జేసీబీతో ధ్వంసం చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆ రోడ్డు బాగు చేయలేదు.

- భవనం నిర్మాణం సందర్భంగా రోజూ వెలువడే వ్యర్థ జలాలను రోడ్డుపైకి వదిలేస్తున్నారు. దాంతో ఆ మార్గం అంతా బురదగా మారి వాహన చోదకులు ఇబ్బందిపడుతున్నారు. అలా వ్యర్థ జలాలు బయటకు వదలవద్దని నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు.

- మాల్‌కు సంబంధించిన కాలువ అవుట్‌లెట్‌ సంపును పక్కనే రహదారిని ఆక్రమించి నిర్మించారు. దానిని తొలగించాలని అక్టోబరు 24న నోటీసులు ఇచ్చారు. స్పందన లేదు.

ఇలా ఇచ్చిన ప్రతి నోటీసును బుట్ట దాఖలు చేస్తూ...అధికారులకు సవాల్‌ విసురుతున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 09:56 AM