Share News

శారదా పీఠానికి వైభవ వెంకటేశ్వరుని ఆలయం!?

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:18 AM

శారదా పీఠం ప్రముఖ ఆలయాలపై దృష్టి సారిస్తోంది. విశాఖలో పేరొందిన ఆలయాల నిర్వహణ బాధ్యతలు దేవదాయ శాఖ నుంచి తప్పించి పీఠానికి దఖలు పడేలా పావులు కదుపుతోంది.

శారదా పీఠానికి వైభవ వెంకటేశ్వరుని ఆలయం!?

నిర్వహణ బాధ్యతలు పీఠానికి అప్పగించాలంటూ ఆలయ కమిటీ లేఖ

ఆగమ శాస్త్ర నిబంధనలకు వ్యతిరేకమంటున్న పూర్వ కమిటీ

2020లోనే ఒకసారి ప్రయత్నం...అడ్డుకున్న అప్పటి కమిటీ

ఆ తరువాత వ్యూహాత్మకంగా దేవదాయ శాఖకు అప్పగింత

ఇప్పుడు పీఠానికి అప్పగించాలంటూ లేఖలు

తెర వెనుక అధికార పార్టీ నేతలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

శారదా పీఠం ప్రముఖ ఆలయాలపై దృష్టి సారిస్తోంది. విశాఖలో పేరొందిన ఆలయాల నిర్వహణ బాధ్యతలు దేవదాయ శాఖ నుంచి తప్పించి పీఠానికి దఖలు పడేలా పావులు కదుపుతోంది. గతంలో సీతమ్మధారలోని షిర్డీ సాయి ఆలయాన్ని ఈ విధంగానే కొన్నాళ్లు నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ అది దేవదాయ శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు కప్పరాడలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంపై పీఠం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని శారదా పీఠానికి అప్పగించాలని కోరుతూ ఆలయ కమిటీ ఇటీవల దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాసింది. దాని ప్రకారం ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. దీనిని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. పీఠాలకు ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం తగదని, దేవదాయ శాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై శనివారం తెలుగుదేశం పార్టీకి చెందిన పులువురు ఆలయం వద్ద ధర్నా చేశారు.

ఇదీ ఆలయ చరిత్ర

కప్పరాడ (విశాఖ ఉత్తర నియోజకవర్గం)లో ఆలయ నిర్మాణం కోసం 1964లో వెంకటేశ్వరస్వామి భక్తురాలైన పూల వెంకట రమణమ్మ ఎకరా స్థలం ఇచ్చారు. కప్పరాడ సర్వే నంబరు 9లోని ఈ భూమి కోసం విల్లు రాసి రిజిస్టర్‌ చేశారు. ఆ తరువాత ఒక కమిటీ ఏర్పాటై 1999లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 2002లో ఆలయం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దీనికి శ్రీ వైభశ వేంకటేశ్వరస్వామి ఆలయంగా నామకరణం చేశారు. ఆ తరువాత దశల వారీగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. రాజగోపురాలు, శేషవాహనం, ముఖ మండపం, గోశాల, నాలుగు అంతస్థుల అన్నదాన సత్రం వంటివి నిర్మించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

భారీగా ఆస్తులు

ఈ ఆలయానికి మూడు కిలోల బంగారు ఆభరణాలు, 100 కిలోల వెండి వస్తువులు, బ్యాంకుల్లో రూ.80 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఆలయానికి వీఐపీ భక్తుల తాకిడి ఎక్కువ. ఏడాదికి సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తుంది.

మూడేళ్ల క్రితమే ప్రణాళిక

వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆదాయం కూడా అధికంగా ఉండడంతో దీనిపై శారదా పీఠం కన్ను పడింది. 2020లోనే దీనిని స్వాధీనం చేసుకోవడానికి పావులు కదిపారు. అప్పగించాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. అయితే అప్పటికి ఆలయం స్థానిక కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆలయం నిర్మించిన నాటి నుంచి 2020 వరకు స్థానిక పెద్దలే కమిటీగా ఏర్పడి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. పీఠానికి ఆలయం అప్పగించాలని వైసీపీ నాయకులు కోరగా, ఒక వర్గం వ్యతిరేకించింది. మరో వర్గం అంగీకరించింది. వెంటనే ఆ కమిటీతో శారదా పీఠానికి లేఖ రాయించారు. ఆలయాన్ని తాము సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని, స్వాధీనం చేసుకుని పూజాదికాలు చేయించాలన్నది దాని సారాంశం. అయితే పీఠం వెంటనే అంగీకారం తెలపకుండా పీఠాధిపతులు ఇద్దరూ రుషీకేశ్‌ పర్యటనలో ఉన్నారని, వచ్చాక నిర్ణయం ప్రకటిస్తామని సమాధానం ఇచ్చింది. ఈ విషయం తెలిసి మరో వర్గం ఆలయాన్ని ఇవ్వడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇలా అయితే లాభం లేదని ఒక రోజు ఆకస్మికంగా నాటి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి, స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త కలిసి ఆలయాన్ని దేవదాయ శాఖకు అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఆ వెంటనే అప్పటి దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతి వెళ్లి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2020 సెప్టెంబరు 30న ఆలయానికి దేవదాయ శాఖ తరఫున ఈఓను నియమించారు. ఇకపై ఈఓ ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతాయని ప్రకటించి, స్థిరచరాస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆనాటి నుంచి ఆలయం దేవదాయ శాఖ పర్యవేక్షణలోనే ఉంది. ఈఓ బండారు ప్రసాద్‌ అన్ని వ్యవహారాలు చూస్తున్నారు.

హంసలదీవిలా ఇవ్వాలని తాజాగా లేఖ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా హంసలదీవిలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను శృంగేరి జగద్గురు మహా సంస్థానానికి అప్పగించింది. ఆ జీఓను అనుసరించి కప్పరాడలో వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శారదా పీఠానికి అప్పగించాలని ప్రస్తుత ఆలయ కమిటీ దేవదాయ శాఖ మంత్రికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాసింది. దానిపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ పూర్వ కమిటీ దీనిని వ్యతిరేకిస్తూ, అప్పగింతకు ఎటువంటి చర్యలు చేపట్టవద్దంటూ దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాసింది. ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నామని, శారదా పీఠం స్మార్త ఆగమ శాస్ర్తాన్ని అనుసరిస్తున్నదని, ఈ రెండూ వేర్వేరు కాబట్టి పూజాదికాల్లో తేడాలు వస్తాయని పేర్కొంది. అదే విధంగా పీఠాలకు, మఠాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం తగదని, ఎప్పటిలాగే దేవదాయ శాఖ పరిధిలోనే ఉంచాలని, లేదంటే ఆలయ కమిటీకే అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఆలయం ముందు శనివారం ధర్నా చేశారు. ఆలయాన్ని శారదా పీఠానికి అప్పగిస్తే ఊరుకోబోమని, ఆలయాల్లో రాజకీయాలు తగవని హెచ్చరించారు. ఈ వివాదంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి. ఇకపోతే ఇటీవల పుట్టినరోజు వేడుకులు చేసుకున్న శారదా పీఠాధిపతి ఇకపై తాను విశాఖపట్నంలో ఉండనని, హైదరాబాద్‌కు మకాం మారుస్తున్నానని ప్రకటించారు. ఆయనే ఇక్కడ ఉండనప్పుడు ఈ ఆలయం ఎవరికి అప్పగిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దేవదాయ శాఖ పరిధిలోనే కొనసాగించాలని సూచిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:18 AM