Share News

వైభవంగా వేల్పులవీధి గౌరమ్మ ఉత్సవం

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:46 AM

వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం తెల్లవారుజామున వైభవంగా ప్రారంభమైంది. గౌరీ పరమేశ్వరులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

వైభవంగా వేల్పులవీధి గౌరమ్మ ఉత్సవం
రథంపై ఉన్న గౌరీ పరమేశ్వరులు

ఆకట్టుకున్న నేలవేషాలు, సాంస్కృతిక ప్రదర్శనలు

భారీగా తరలి వచ్చిన జనం

అనకాపల్లి టౌన్‌, జనవరి 20: వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం తెల్లవారుజామున వైభవంగా ప్రారంభమైంది. గౌరీ పరమేశ్వరులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. రాజకీయ ప్రముఖులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ, బుద్ద నాగజగదీశ్వరరావు, దాడి రత్నాకర్‌, పరుచూరి భాస్కరరావు, డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌, కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, అధిక సంఖ్యలో భక్తులు గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. తెల్లవారుజామునే ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై అధిష్ఠింపజేసి పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం విజయనగరం, కాకినాడ, విజయవాడ, సబ్బవరం ప్రాంతాలకు చెందిన కళాకారుల నేలవేషాలు ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిననాలుగురోడ్ల జంక్షన్‌ నుంచి శారదానది వరకు ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన జనంతో రహదారులు కిటకిటలాడాయి. అర్ధరాత్రి సమయంలో భారీ ఎత్తున బాణసంచా వెలిగించారు. ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు, పట్టణ సీఐ జి.శంకరరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 21 , 2024 | 12:46 AM