Share News

ఏయూకు ఇన్‌చార్జి వీసీ?

ABN , Publish Date - Jul 17 , 2024 | 01:08 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఏయూకు ఇన్‌చార్జి వీసీ?

  • రెండు, మూడు వారాల్లో నియామకం

  • రేస్‌లో పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు

  • ఇంచుమించు పది మంది వరకూ...

  • తమకు ఉన్న పరిచయాల ద్వారా పైరవీలు

  • ఇప్పటికే సమాచార సేకరణలో ప్రభుత్వం

  • ఇన్‌చార్జిని నియమించిన తరువాత పూర్తిస్థాయి వీసీ నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం

  • ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆరు నెలలు నుంచి ఏడాది సమయం

విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత నెలాఖరులో వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ర్టార్‌ స్టీఫెన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. స్టీఫెన్‌ స్థానంలో ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్‌ కిశోర్‌బాబును నియమించారు. వీసీ పోస్టు మాత్రం ఖాళీగానే ఉంది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతోపాటు కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి వీసీ నియామకం ఇప్పటికిప్పుడు సాధ్యం కానందున రెండు, మూడు వారాల్లో ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ను నియ మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

ఏయూతోపాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలను ప్రభుత్వం నియమించనున్నది. ఇందుకోసం సమ ర్థులైన వారిని గుర్తించే బాధ్యతను సీఎం చంద్రబాబు నాయుడు కొందరికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఏయూలో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు తమ స్థాయిలో ప్రయత్నాలను చేస్తుండగా, మరికొందరు తమకున్న సీనియారిటీని బట్టి అవకాశం వస్తుందన్న భావనలో ఉన్నారు. ప్రస్తుతం ఏయూ ఇన్‌చార్జి వీసీ రేస్‌ సుమారు పది మంది ఉన్నారు. వీరిలో మాజీ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావు, ఫారెన్‌ అఫైర్స్‌ డీన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ధనుంజయ్‌, ఇంజ నీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శశిభూషణ్‌, శ్రీకాకుళం యూని వర్సిటీ వీసీగా పనిచేసి, ప్రస్తుతం మెకానికల్‌ ఇంజ నీరింగ్‌ విభాగంలో ఉన్న ప్రొఫెసర్‌ రాంజీ, ఎగ్జామినేషన్‌ విభాగం డీన్‌గా చేస్తున్న ప్రొఫసర్‌ డీవీఆర్‌ మూర్తి, ఏయూ సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎంవీఆర్‌ రాజు, గతంలో ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌గా చేసి ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ వల్లీ కుమారి, అదే విభా గంలో పనిచేస్తున్న మరో సీనియర్‌ ప్రొఫెసర్‌ శశితోపాటు ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీగా పదవీ విరమణ పొందిన మరో సీనియర్‌ ప్రొఫెసర్‌ పేరు వినిపిస్తోంది. వీరిలో ఒక సీనియర్‌ ప్రొఫెసర్‌ రాజకీయంగా తనకున్న పలుకబడిని వినియోగిస్తున్నట్టు తెలిసింది. స్పీకర్‌తోపాటు పొరుగు జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి ద్వారా ప్రయత్నాలను సాగిస్తున్నట్టు తెలిసింది. అయితే, ఆయన గత వీసీ ప్రసాదరెడ్డి కోటరీకి చెందిన వ్యక్తి అన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. అలాగే, నగరానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ద్వారా మరో సీనియర్‌ ప్రొఫెసర్‌ తన ప్రయత్నాన్ని చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. గతంలో శ్రీకాకుళం యూని వర్సిటీకి వీసీగా చేసిన మరో ప్రొఫెసర్‌ తనకు బంధువైన అధికార పార్టీ ఎమ్మెల్యే ద్వారా తన ప్రయత్నాన్ని గట్టిగానే చేస్తున్నారు. పరిశోధనలు, సీనియారిటీ, ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకని తనకు అవకాశం కల్పిస్తారన్న భావనలో మరో సీనియర్‌ ప్రొఫెసర్‌ ఉండగా, వర్సిటీలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను తానైతే పరిష్కరించగలనన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉందని, తనకు అవకాశం దక్కుతుందని మరో ప్రొఫెసర్‌ చెబు తున్నారు. ప్రభుత్వం సదరు సీనియర్‌ ప్రొఫెసర్‌ పేరు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారన్న భావనను మరో సీనియర్‌ ప్రొఫెసర్‌ వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు బయట నుంచి మరో ఇద్దరు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం ఎవరికి అవకాశం కల్పిస్తుందో చూడాలి.

గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి

వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన వీసీలంతా గవర్నర్‌కు తమ రాజీనామాలు చేశారు. రాజీనామాలపై గవర్నర్‌ న్యాయ సలహాను కోరడం వల్లే కొత్త వీసీల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్టు చెబు తున్నారు. గవర్నర్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే అప్పటికే సిద్ధం చేసిన జాబితాల్లో ఒకరిని ఇన్‌చార్జి వీసీగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత పూర్తిస్థాయి వీసీ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ ఇవ్వడంతోపాటు దరఖాస్తుల స్వీకరణ, సెర్చ్‌ కమిటీ నియామకం, ఇతర ప్రక్రియను పూర్తిచేసి పూర్తిస్థాయి వీసీలను నియమించనున్నారు.

Updated Date - Jul 17 , 2024 | 01:08 AM