రైలు నుంచి జారిపడి వడ్డాది వాసి మృతి
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:06 AM
అనకాపల్లి నుంచి హైదరాబాదు రైలులో ప్రయాణిస్తున్న వడ్డాదికి చెందిన దొండా సన్యాసిరావు(62) ప్రమాదశాత్తూ జారిపడి మృతి చెందాడు.

బుచ్చెయ్యపేట, జూలై 4: అనకాపల్లి నుంచి హైదరాబాదు రైలులో ప్రయాణిస్తున్న వడ్డాదికి చెందిన దొండా సన్యాసిరావు(62) ప్రమాదశాత్తూ జారిపడి మృతి చెందాడు. సన్యాసిరావు సోమవారం ఉదయం జన్మభూమి రైలులో అనకాపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్నారు. సామర్లకోట సమీపంలో రైలు పట్టాల పక్కన సన్యాసిరావు మృతదేహం పడి ఉండడాన్ని మంగళవారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రమాదశాత్తూ రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావించారు. భర్త హైదరాబాద్ చేరుకోకపోవడంతో బుధవారం భార్య అమ్మోజీ.. సన్యాసిరావు సెల్‌కి ఫోన్ చేయగా, రైల్వే పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో కుటుంబీకులు సామర్లకోట చేరుకుని, శాఖాపరమైన చర్యల అనంతరం గురువారం మధ్యాహ్నం మృతదేహాన్ని వడ్డాది తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. సన్యాసిరావు దుర్మరణం చెందడంపై భార్య అమ్మోజీ, కుమారులు హరీశ్, వెంకటేశ్, కుమార్తె సూర్యకళ కన్నీరు మున్నీరుగా విలపించారు.