Share News

వలంటీర్లను వాడేస్తున్నారు!

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:55 AM

గ్రామ/ వార్డు వలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదని హైకోర్టు, ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కానీ వైసీపీ నేతలు అధికారంలో వున్నామన్న ధీమాతో ఎప్పటి మాదిరిగానే రాజ్యంగ బద్ధమైన సంస్థల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.

వలంటీర్లను వాడేస్తున్నారు!

వైసీపీ నేతలు ఇష్టారాజ్యం

న్యాయస్థానం, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు బేఖాతరు

వలంటీర్ల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరణ

ఇందుకు ప్రతిఫలంగా ‘నగదు తాంబూలం’

‘పేట సమన్వయకర్త కార్యాయలంలో జనరాలు పంపిణీ

ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇచ్చినట్టు సమాచారం

అనకాపల్లి, మార్చి 15: గ్రామ/ వార్డు వలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదని హైకోర్టు, ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కానీ వైసీపీ నేతలు అధికారంలో వున్నామన్న ధీమాతో ఎప్పటి మాదిరిగానే రాజ్యంగ బద్ధమైన సంస్థల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అధికారికంగా కాకపోతే అనధికారికంగా వలంటీర్ల సేవలను వాడుకుంటామంటూ బరితెగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, వారికి తాయిలాలు అందించేందుకు వలంటీర్లను వాడుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు లేదా ఎమ్మెల్యేలు తొలుత మండలాల వారీగా వలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు-తిమ్మాపురం కేంద్రంగా వున్న పాయకరావుపేట నియోజకవర్గం సమన్వకర్త, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు నివాసం వద్దకు గురువారం రాత్రి నక్కపల్లి మండలానికి చెందిన వలంటీర్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో 15 నుంచి 25 మంది వరకు గ్రామ వలంటీర్లు వున్నారు. వీరితోపాటు పార్టీ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ఏ విధంగా సహకరించాలో దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు మీ చేతుల మీదుగానే డబ్బులు పంపిణీ చేయిస్తామని, ఇదే సమయంలో గ్రామాల్లో విపక్షాల నాయకులపై నిఘా వేయాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే జీతాలు పెరుగుతాయని, టీడీపీ ప్రభుత్వం వస్తే మీ ఉద్యోగాలు వుండని అబద్ధాలు చెబుతున్నారు.

ఓటర్ల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరణ!

గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వలంటీర్ల పరిధిలో 50 కుటుంబాలు వున్నాయి. ప్రతి కుటుంబంలో ఎంత మంది ఓటర్లు వున్నారు? ఆ ఇంటిలో పెద్ద ఎవరు? బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌ పే వున్న మొబైల్‌ నంబర్లు సేకరించి ఇవ్వాలని స్పష్టం చేశారు. తాము ఇచ్చే డబ్బులను మీ బ్యాంకు ఖాతాల్లో వేసుకుని, మీ మొబైల్‌ డిజిటల్‌ యాప్‌ ద్వారా ఓటర్ల ఖాతాకు జమ చేయాలని చెప్పారు.అలా వీలులేని పక్షంలో ఓటర్ల బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ డిజిటల్‌ యాప్‌ వున్న ఫోన్‌ నంబర్ల వివరాలను తమకు అందజేస్తే.. పార్టీ నియమించిన ప్రత్యేక బృందాలు నగదు బదిలీ వ్యవహారాలను చక్కబెడతాయన్నారు. ఈ సందర్భంగా ప్రతి వలంటీరుకు మొదటి విడత నజరానాగా రూ.5 వేల చొప్పున నగదు అందజేసినట్టు తెలిసింది. ముందు ముందు మీ ‘సహకారం’ బట్టి మరిన్ని నజరానాలు వుంటాయని ప్రకటించినట్టు సమాచారం.

Updated Date - Mar 16 , 2024 | 12:55 AM