Share News

క్లాప్‌ కార్మికులకు అందని వేతనాలు

ABN , Publish Date - May 23 , 2024 | 01:10 AM

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) వాహనాలతో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. అయినప్పటికీ వారిని విధుల్లోకి తీసుకున్న కాంట్రాక్టర్‌ గానీ జీవీఎంసీ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. జీవీఎంసీ పరిధిలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు సచివాలయానికి ఒకటి చొప్పున 650 వాహనాలను కేటాయించారు. వాహనంతోపాటు డ్రైవర్‌ను సమకూర్చినందుకు కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ నెలకు రూ.65 వేలు చొప్పున చెల్లిస్తోంది. వాహనంతోపాటు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేందుకు జీవీఎంసీకి చెందిన ప్రజారోగ్య విభాగం అధికారులు అవుట్‌సోర్సింగ్‌లో పారిశుధ్య కార్మికులను నియమించుకున్నారు.

క్లాప్‌ కార్మికులకు అందని వేతనాలు

మూడు నెలల కిందట విధుల్లోకి 650 మంది...

రోజుకు రూ.450 చొప్పున ఇచ్చేందుకు జీవీఎంసీ అంగీకారం

టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్‌ ఎంపిక

జీతాలు చెల్లించని సదరు కాంట్రాక్టర్‌

తమకు సంబంధం లేదంటున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) వాహనాలతో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. అయినప్పటికీ వారిని విధుల్లోకి తీసుకున్న కాంట్రాక్టర్‌ గానీ జీవీఎంసీ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. జీవీఎంసీ పరిధిలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు సచివాలయానికి ఒకటి చొప్పున 650 వాహనాలను కేటాయించారు. వాహనంతోపాటు డ్రైవర్‌ను సమకూర్చినందుకు కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ నెలకు రూ.65 వేలు చొప్పున చెల్లిస్తోంది. వాహనంతోపాటు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేందుకు జీవీఎంసీకి చెందిన ప్రజారోగ్య విభాగం అధికారులు అవుట్‌సోర్సింగ్‌లో పారిశుధ్య కార్మికులను నియమించుకున్నారు. ఒక్కో వాహనం వెంట ఇద్దరిని లోడర్లుగా పంపించారు. అయితే నగరంలో పారిశుధ్య నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడడంతో క్లాప్‌ వాహనాలతో లోడర్లుగా వెళుతున్న కార్మికులను అధికారులు వెనక్కి రప్పించారు. వారి స్థానంలో ఒక్కో వాహనానికి ఒక కార్మికుడు లోడర్‌గా ఉండేలా 650 మంది కార్మికులను రోజువారీ కూలీ ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రోజుకు రూ.450 చొప్పున చెల్లించేలా 650 మంది కార్మికులను జీవీఎంసీకి సరఫరా చేసేందుకు టెండర్‌ పిలిచారు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మూడు నెలల కిందట కార్మికులను జీవీఎంసీకి అప్పగించారు. వారంతా క్లాప్‌ వాహనాల వెంట ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి వాహనాల్లో వేస్తున్నారు. అయితే వీరికి మూడు నెలలుగా జీతం చెల్లించడం లేదు. దీనిపై కార్మికులు జీవీఎంసీ అధికారులను కలిసి సమస్యను వివరిస్తే తమకు కాంట్రాక్టర్‌ ఇంకా బిల్లు పెట్టలేదని సమాధానం ఇస్తున్నారు. జీవీఎంసీ బిల్లుతో సంబంధం లేకుండా కార్మికులకు నెల పూర్తయ్యేసరికి కాంట్రాక్టరే వేతనాలను చెల్లించి, తర్వాత జీవీఎంసీ నుంచి రాబట్టుకోవాలి. కానీ కాంట్రాక్టర్‌ మాత్రం జీవీఎంసీ బిల్లు ఇచ్చేంత వరకూ తాను ఇచ్చేది లేదంటూ చేతులెత్తేసినట్టు కార్మికులు వాపోతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రోజువారీ కూలీ ఉద్యోగాలకు రూ.50 వేలు వరకూ వసూలు

క్లాప్‌ వాహనాల్లోకి చెత్తను లోడ్‌ చేసేందుకు రోజువారీ కూలీ ప్రాతిపదికపై విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు కాంట్రాక్టర్‌తోపాటు కొంతమంది మధ్యవర్తులకు రూ.50 వేలు వరకూ చెల్లించినట్టు తెలిసింది. జీవీఎంసీలో ఉద్యోగాలు అనేసరికి ఎప్పుడైనా పర్మనెంట్‌ అయిపోతాయని మధ్యవర్తులు, కాంట్రాక్టర్‌ చెప్పడంతో అప్పులు చేసి మరీ డబ్బులు కట్టినట్టు కార్మికులు చెబుతున్నారు. ఇప్పుడు మానేస్తే, గతంలో కట్టిన డబ్బుతోపాటు మూడు నెలల వేతనాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో అర్ధాకలితోనే విధులు నిర్వర్తిస్తున్నామని వాపోతున్నారు. ఈ విషయం జీవీఎంసీ అధికారుల వద్ద ప్రస్తావిస్తే కాంట్రాక్టర్‌ ఇంతవరకూ బిల్లు పెట్టలేదని చెబుతున్నారు. అయినా కాంట్రాక్టర్‌ ముందుగా కార్మికులకు వేతనాలు చెల్లించి, తర్వాత ఆ బిల్లు తమకు పెడితే నిధులు విడుదల చేస్తామన్నారు. అందుకోసం కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ కొంత మార్జిన్‌ కూడా ఇస్తోందని వివరించారు. అయితే కాంట్రాక్టర్‌ మాత్రం జీవీఎంసీ బిల్లు ఇచ్చిన తర్వాతే కార్మికులకు చెల్లించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - May 23 , 2024 | 08:29 AM