టీచర్లకు అందని జీతాలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:19 AM
కొన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు.

పలు శాఖల ఉద్యోగులకు కూడా...
పింఛన్‌దారులది అదే పరిస్థితి
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణం
విశాఖపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
కొన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేలోగా పాలనా వ్యవహారాలు చూడాల్సినవారు ఎందుచేతనో నిర్లిప్తంగా ఉండిపోయారు. దాంతో ఆరో తేదీ వచ్చినా పలు శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగ/ఉపాధ్యాయులకు పింఛన్లు అందలేదు. ఉపాధ్యాయ, ఉద్యోగుల జీతాల బిల్లులు గత నెల సకాలంలోనే అప్‌లోడ్ చేశారు. రెవెన్యూ, ట్రెజరీతోపాటు కొన్ని శాఖలకు ఈ నెల ఒకటో తేదీ తరువాత జీతాలు అందాయి. మిగిలిన శాఖల ఉద్యోగులంతా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. గత మూడేళ్ల నుంచి జీతాలు, పింఛన్లు సక్రమంగా అందడం లేదు. విడతల వారీగా పదో తేదీన, అప్పుడప్పుడు 15వ తేదీ వరకు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండేవి. అయితే ఈ నెల నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జీతాలు, పింఛన్ల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాతే జీతాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా జూన్ నెలలో ఖర్చు అధికంగా ఉంటుంది. పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ వంటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఇప్పటివరకూ జీతాలు రాకపోతే పిల్లలను పాఠశాలలు/కళాశాలల్లో ఎలా చేర్పిస్తామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీఆర్ అంబేద్కర్ ప్రశ్నించారు. జీతాలు, పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. టీచర్లు, ఉద్యోగులు ప్రభుత్వానికి వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారన్న కారణంతో ప్రభుత్వంలో ఉన్నతాధికారులు జీతాల విషయం పట్టించుకోలేదని ఎస్టీయూ అధ్యక్షులు ఈ.పైడిరాజు ఆరోపించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేలోగా జీతాలు, పింఛన్లు అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.