Share News

అనధికారికంగా కళాశాల నిర్వహణ

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:42 AM

దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అశీల్‌మెట్ట జంక్షన్‌లో అనధికారికంగా ‘రామబాణం’ పేరుతో జూనియర్‌ కళాశాలను నిర్వహిస్తున్నారు.

అనధికారికంగా కళాశాల నిర్వహణ

ఇదీ ‘సౌత్‌’ ఎమ్మెల్యే వాసుపల్లి నిర్వాకం

చోద్యం చూస్తున్న ఇంటర్‌బోర్డు అధికారులు

విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):

దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అశీల్‌మెట్ట జంక్షన్‌లో అనధికారికంగా ‘రామబాణం’ పేరుతో జూనియర్‌ కళాశాలను నిర్వహిస్తున్నారు. మర్రిపాలెంలోని రాణాప్రతాప్‌నగర్‌లో రామబాణం జూనియర్‌ కళాశాల (కోడ్‌ నంబరు 02029) నిర్వహిస్తున్నారు. అదే పేరుతో గాజువాకలో ఒక కళాశాల ఉంది. రాణాప్రతాప్‌నగర్‌, గాజువాకల్లో గల కళాశాలలకు ఇంటర్‌ బోర్డు అనుమతి ఉంది. అయితే రాణాప్రతాప్‌నగర్‌లో గల కళాశాల కోడ్‌ నంబర్‌తోనే అశీల్‌మెట్టలో తన కార్యాలయం భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ‘రామబాణం’ కళాశాలను నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలకు ఎమ్మెల్యే వాసుపల్లి డైరెక్టర్‌గా ఉన్నారు. కనుమ పండుగ సందర్భంగా మంగళవారం ఉదయం ఆశీల్‌మెట్టలో గల కళాశాలలోనే దక్షిణ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మద్యం, కోళ్లు సరఫరా చేశారు. ఒకే నంబరుతో రెండుచోట్ల కళాశాలల నిర్వహణ గురించి ఇంటర్‌ బోర్డు అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా వారెవరూ అందుబాటులో దొరకలేదు.

Updated Date - Jan 17 , 2024 | 12:42 AM