Share News

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:59 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం వత్తాసు పలుకుతుండడం దారుణమన్నారు.

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే
బైక్‌ ర్యాలీలో పాల్గొన్న నాయకులు, జనసైనికులు.

బైక్‌ ర్యాలీలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు

గాజువాక, జనవరి 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం వత్తాసు పలుకుతుండడం దారుణమన్నారు. గాజువాక నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ కోసం నిర్వాసితులు భూములిస్తే నేడు వారికి అన్నివిధాల అన్యాయం జరిగిందన్నారు. గంగవరం పోర్టు ప్రభుత్వ రంగంలో ఉంటే ఉపాధి వస్తుందని ఆశించిన మత్య్సకారుల ఆశలు గల్లంతయ్యాయన్నారు. రూ.2,400 కోట్ల గంగవరం పోర్టు ఆస్తులను కేవలం రూ.560 కోట్లకు అమ్మేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఉపాధి కోసం గాజువాక వచ్చి కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న పేదలకు వంద గజాల స్థలం ఇవ్వడానికి వైసీపీ పెద్దలకు చేతులు రావడం లేదని, అయితే తమ అవసరాలకు మాత్రం వందల ఎకరాలను ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉపాధి లేక ఎంతోమంది యువత ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడసాల అప్పారావు, దల్లి గోవిందరెడ్డి, తిప్పల వెంకటరమణారెడ్డి, కరణం కనకారావు, గంధం వెంకటరావు, కోన చిన అప్పారావు, మురళీ, దేవి, గోపీచంద్‌, తదితరులతో పాటు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.

88వ వార్డులో బైక్‌ ర్యాలీ..

గోపాలపట్నం: జనసేన-తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని జనసేన పార్టీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు కోరారు. 88వ వార్డు పరిధి నరవ గ్రామానికి చెందిన జనసేన నాయకుడు గల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. గవరజగ్గయ్యపాలెంలో ప్రారంభమైన ర్యాలీ సత్తివానిపాలెం, కోటనరవ, నరవ, జెర్రిపోతులపాలెం, ఇప్పిలివానిపాలెం, నందవానిపాలెం, చింతగట్ల ప్రాంతాల మీదుగా సాగింది. అనంతరం ఇప్పిలివానిపాలెంలో ఏర్పాటు చేసిన సభలో పలువురు జనసేనలో చేరగా, వారికి రమేశ్‌బాబు పార్టీ కుండువాలు వేశారు.

Updated Date - Jan 28 , 2024 | 11:59 PM