Share News

నాటు పడవ బోల్తా పడి గిరిజనుడి మృతి

ABN , Publish Date - May 06 , 2024 | 01:11 AM

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన జోలాపుట్టు జలాశయం దిగువ ప్రాంతంలో నాటు పడవ బోల్తా పడి ఒడిశాకు చెందిన గిరిజనుడు మృతి చెందాడు. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరగగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి.

నాటు పడవ బోల్తా పడి గిరిజనుడి మృతి
మృతుడు ఉద్దవ్‌ (ఫైల్‌ ఫొటో)

ముంచంగిపుట్టు, మే 5: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన జోలాపుట్టు జలాశయం దిగువ ప్రాంతంలో నాటు పడవ బోల్తా పడి ఒడిశాకు చెందిన గిరిజనుడు మృతి చెందాడు. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరగగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా బంగురుపడ గ్రామానికి చెందిన కొర్రా ఉద్దవ్‌(35) అనే గిరిజనుడు శనివారం సాయంత్రం జోలాపుట్టు జలాశయం దిగువన ప్రవహిస్తున్న గెడ్డ నుంచి నాటు పడవ సహాయంతో కుంబిపడ గ్రామంలో గల బంధువుల ఇంటికి బయలుదేరాడు. గెడ్డ దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. ఉద్దవ్‌ తమ గ్రామానికి రాలేదని బంధువులు తెలపడంతో రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులు గెడ్డ దాటే ప్రదేశానికి వెళ్లి చూడగా నాటు పడవ గెడ్డలో తేలుతూ కనిపించింది. రాత్రి వేళ అయినప్పటికీ కుటుంబ సభ్యులు నాటు పడవలతో గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఆదివారం ఉదయం మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన ప్రాజెక్టు అధికారులు జోలాపుట్టు జలాశయం నుంచి డుడుమకు నీటి సరఫరాను నిలిపివేసి ఒడిశా అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల తరువాత ఉద్దవ్‌ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Updated Date - May 06 , 2024 | 01:11 AM